ఏపీ అధికార పార్టీ వైసీపీకి కొన్ని నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉన్నాయి. గుడివాడ, విజయవాడ పశ్చిమం, రాయచోటి, పులివెందుల, కడప, గుంటూరు ఈస్ట్, ప్రత్తిపాడు, కర్నూలు, ఆదోని, పాణ్యం, విజయనగరం, బొబ్బిలి, బాపట్ల.. ఇలా.. చాలా నియోజకవర్గాలు కంచుకోటలుగా మారాయి. ఈ నియోజకవర్గాల్లో వరుస విజయాలు దక్కించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన నాయకులు కూడా వీర విధేయులుగా పేరు తెచ్చుకున్నారు.
నాయకులు ఎవరు? అనేది పక్కన పెడితే.. నాయకులను మార్చినా కూడా ఇక్కడ విజయం సాధిస్తోంది. ఇక్కడ పార్టీకి మంచి పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు అవే నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? ఏవిధంగా దూసుకుపోతోంది. అనేది చర్చకు వస్తోంది. వైసీపీ అధినేత సీఎం జగన్.. దగ్గర ఈ ప్రస్తావన కూడా వచ్చింది. అయితే, చాలా నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి పలచన అయిందని తెలిసింది.
నిజానికి కొన్ని నియోజకవర్గాల మాట ఎలా ఉన్నప్పటికీ.. చాలా వరకు కంచుకోటలుగా ఉన్న నియోజకవ ర్గాల్లో నాయకుల పరిస్థితి బాగానే ఉన్నా.. డెవలప్మెంట్ కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న తప్పిదంగానే తెలుస్తోంది. నియోజకవర్గాలకు రూ. కోటి చొప్పున ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ .. ఇప్పటి వరకు నెరవేర్చలేక పోయారు.
ఇది ఇచ్చి ఉంటే అంతో ఇంతో అభివృద్ధి సాగేది. రాయచోటి నియోజకవర్గంలో చీఫ్ విప్‌గా ఉన్న సమయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. రోడ్లు, డ్రైనేజీ, చెత్త డంపింగ్ యార్డు, కల్వర్టలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, పనులు మధ్యలో ఉన్న సమయంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. దీంతో నిధులు కూడా సగంలో ఆగిపోయాయి. ఇప్పుడు వాటి ప్రస్తావనే లేకుండా పోయింది.
అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. సో.. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. కంచుకోటలు కూడా ఇబ్బందిగానే మారుతున్నాయని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. వైసీపీ విషయంపై సూచనలు చేస్తున్నారు. కేవలం జగన్ ఇమేజ్ ఇప్పుడు సరిపోదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates