ముఖ్య‌మంత్రి అయినప్ప‌టికీ.. జ‌గ‌న్ కోర్టుకు రావాల్సిందే: న్యాయ‌మూర్తి

ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టుకు రావాల్సిందేన‌ని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ 2018-19 మ‌ధ్య‌లో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో విశాఖ‌లోని విమానాశ్ర‌యంలో ఆయ‌న‌పై కోడి కత్తితో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న‌ శ్రీనివాస్ అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే.. ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ఐఏకు అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో ఎన్ఐఏ కోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోడిక‌త్తి కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని న్యాయ‌మూర్తి అన్నారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయితే.. అది ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మేన‌ని.. కోర్టుకు కాద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కోర్టు టేప్‌ రికార్డర్గా ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం జ‌గ‌న్‌ను ఇప్ప‌టి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. సమాధానంగా స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఎన్ఐఏ న్యాయవాది చెప్పారు.

రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. చార్జ్‌షీట్లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది.

కోర్టుకు బాధితుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. మ‌రోవైపు.. ఈ కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలంటూ.. ఆయ‌న త‌ల్లిదండ్రులు చేసిన విన్న‌పాన్ని ఎన్ఐఏ తోసిపుచ్చింది. బెయిల్ నిరాకరించింది. అస‌లు ఈ కేసులో వాద‌న‌లే ప్రారంభం కాకుండా.. బెయిల్ ఎలా ఇస్తామ‌ని వ్యాఖ్యానించింది.