ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న దాని ప్రకారం జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని భావించారు.
అనూహ్యంగా ప్రధాని మోడీ పర్యటన పోస్టు పోన్ కావటంతో.. ఈ రైలును షెడ్యూల్ ప్రకారం ప్రారంభిస్తారా? లేదా? అన్న సందేహం కలిగింది.అయితే..అందుకు భిన్నంగా నాలుగు రోజులు ముందుగా అంటే ఈనెల 15న ఉదయం పది గంటల వేళలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా వందే భారత్ రైలునుప్రారంభించనున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఏడు వందే భారత్ రైళ్లను దేశంలో అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా పరుగులు తీయనున్నది ఎనిమిదో రైలుగా చెప్పాలి. సికింద్రాబాద్ – విశాఖకు మధ్య ప్రయాణ దూరాన్ని ఈ రైలు పుణ్యమా అని 8.40 గంటలకు తగ్గిపోనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ ప్రతిష్ఠాత్మక రైలును మరో మూడు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. బుధవారం ట్రయల్ రన్ ను పూర్తిచేశారు. పూర్తిగా చైర్ కార్ బోగీలు ఉన్న ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఈ రైలు మొత్తం కెమేరాల పర్యవేక్షణలో ఉండనుంది. విశాలమైన టాయిలెట్ ఈ రైళ్లలో ఉండనున్నాయి.
ఇదిలా ఉండే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల వేళలో విశాఖ రైల్వే స్టేషన్ ను చేరుకున్న వందే భారత్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి జరిపారు. దీంతో.. రెండు కోచ్ అద్దాలు పగిలిపోయాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.