ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ జంకుతున్నారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ అంటేనే రాజ‌కీయ వ్యూహాల‌కు పెట్టింది పేరు. ఆయ‌న అడుగు తీసి అడుగు వేస్తే.. వ్యూహాలే ఉంటాయి. ఇప్పుడు బీఆరఎస్ పార్టీ అధినేత‌గా.. ఆయ‌న తొలి స‌భ‌ను ఖ‌మ్మం గ‌డ్డ‌పై పెడుతున్నారు. నిజానికి ఆయ‌న తొలి స‌భ‌ను ఏపీలోనో.. ఢిల్లీలోనొ పెడ‌తార‌ని ఆది నుంచి కూడా ఒక చ‌ర్చ న‌డుస్తోంది. కానీ, దీనికి భిన్నంగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ‌కు రానున్న 19వ తేదీకి ముందు రోజు కేసీఆర్‌.. ఖ‌మ్మంలో స‌భ పెట్ట‌డం.. ఆస‌క్తిగా మారింది.

ఈ స‌భ ద్వారా.. కేసీఆర్ ఏం చెప్ప‌నున్నారు? అనేది కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, సీఎం కేసీఆర్‌.. ఖమ్మం జిల్లాను కీలకంగా భావిస్తున్నారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండ‌డం.. ఏపీలో ఇటీవలే బీఆర్ఎస్‌ అధ్యక్షుడిని ప్ర‌క‌టించ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీలో ఇప్పుడిప్పుడే.. నేరుగా అడుగు వేసే బ‌దులు.. ముందుగా ఏపీకి స‌రిహ‌ద్దుగా ఉన్న ఖ‌మ్మం వంటి జిల్లాను కేంద్రంగా చేసుకుని ముందుకు సాగితే బెట‌ర్ అని ఆయ‌న భావిస్తున్న‌ట్టుగా ఉంది.

అంటే.. ఏపీలో ఇప్ప‌టికిప్పుడు నేరుగా వెళ్లిపోవ‌డం కంటే.. స‌మీప స‌రిహ‌ద్దులో స‌మావేశం పెట్టి.. ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి.. అక్క‌డ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకునే వ్యూహం ఏదో ఉంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఇక‌, మ‌రోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పైగా ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు బలం ఉంది. ఇటీవలి మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

వారిని ఒప్పించి.. ఎన్నిక‌ల్లో త‌న‌కు అనుకూలంగా తిప్పుకోగ‌లిగారు. దీనికి తోడు అక్కడ పార్టీలో వర్గ విభేదాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్‌ బలాన్ని చాటేందుకు ఖమ్మం లో ఆవిర్భావ సభను పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు.. ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌కు రావ‌డానికి ముందు రోజు పెడుతున్న స‌భ ద్వారా కేంద్రాన్ని టార్గెట్ చేయ‌డం కూడా ఒక వ్యూహంగా ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి చాలా వ్యూహాత్మ‌కంగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.