పవన్ కల్యాణ్ 2024లో పోటీచేసేది ఇక్కడి నుంచే

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ తరువాత వైసీపీ నేతలంతా విమర్శలు కురిపిస్తుంటే.. టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం పవన్ ఊ అంటే అనంతపురం నుంచి ఆయన్ను గెలిపించుకుంటామని ప్రకటన చేశారు. టీడీపీతో పొత్తులు ఇంకా ఖరారు కాకముందే… చంద్రబాబు కానీ, పవన్ కానీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వకుముందే ప్రభాకర్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం చర్చనీయమవుతోంది.

నిజానికి 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఆయన అనంతపురంలో పలుమార్లు పర్యటించారు. కానీ, చివరకు గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు పవన్.

దీంతో ఈసారి పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు వేర్వేరుగా పోటీ చేశాయి. అది వైసీపీకి కలిసొచ్చింది. ఈసారి టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే పవన్ కల్యాణ్‌కు గతంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలు రెండింట్లో ఏదైనా కూడా అనుకూలమే అవుతుంది.

పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గంలో వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. గ్రంధి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచిన పవన్ కల్యాణ్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 54 వేల ఓట్లు సాధించారు. పవన్ సుమారు 8 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ టీడీపీ, జనసేన ఓట్లు కలిపితే వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువ. సుమారు 45 వేల ఓట్లు ఈ రెండు పార్టీలకు కలిపి ఎక్కువగా వచ్చాయి.

అలాగే… పవన్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజువాకలో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేసి పవన్ కల్యాణ్‌పై 14,520 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ తిప్పల నాగిరెడ్డికి 74,645 ఓట్లు రాగా.. రెండోస్థానంలో ఉన్న పవన్‌కు 56,125 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు 54,642 ఓట్లు సాధించారు. ఇక్కడ కూడా టీడీపీ, జనసేన అభ్యర్థుల ఓట్లు మొత్తం కలిపితే వైసీపీ అభ్యర్థి ఓట్లు కంటే సుమారు 25 వేలు అధికంగానే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి ఆఫర్ చేస్తున్న అనంతపురం ఏమీ జనసేనకు కానీ టీడీపీకి కానీ కంచుకోట కాదు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1983, 1985 తరువాత మళ్లీ 2014 వరకు గెలవలేదు. 2019లో మళ్లీ టీడీపీ ఈ స్థానాన్ని కోల్పోయింది. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన అనంతవెంకట్రామిరెడ్డి.. టీడీపీ అభ్యర్థి ప్రభాకర చౌదరిపై 28,698 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మరోవైపు అనంతపురంలో 2019లో పోటీ చేసిన జనసేన అభ్యర్థికి సుమారు 11 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం పోలయిన ఓట్లలో అది 7 శాతమే.

వీటన్నిటి నేపథ్యంలో పవన్ ఈసారి గతంలో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గాన్ని కానీ, గాజువాకను కానీ మళ్లీ ఎంచుకుంటారని తెలుస్తోంది. గాజువాకలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆ తరువాత జనంలో ఉంటూ, నిత్యం ప్రభుత్వంపై ఏదో ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరి పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తే.. పల్లా సహకరిస్తే విజయం ఖరారే. లేదంటే కష్టమే.

ఇక భీమవరం విషయానికొస్తే ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కాపు ఫీవర్ తీవ్రంగా ఉండడంతో పవన్‌కు గతసారి కంటే ఎక్కువ అనుకూలతలున్నాయి. టీడీపీతో కూటమి ఏర్పడితే భీమవరం ఆయనకు సేఫ్ జోన్ అవుతుంది.

అందరూ అనుకుంటున్నట్లు టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే పవన్ గతసారిలా కాకుండా ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశాలే ఎక్కువ.