తెలంగాణలో కేసీఆర్‌ను సాగనంపడానికి అన్ని మార్గాలనూ వాడుకోవాలని బీజేపీ తలపోస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు పోరాడిన బండి సంజయ్ స్థానంలో కొత్తగా ఈటల రాజేందర్‌కు బీజేపీ తెలంగాణ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ యోచిస్తోందట.
ఆందోళనలు, ప్రదర్శనలు, మాటల దాడి చేయడంలో బండి సంజయ్ ఏమీ తక్కువ కానప్పటికీ కేసీఆర్ జిత్తులకు మించి ఎత్తులు వేయాలంటూ బండి సంజయ్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవారు కావాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కు పగ్గాలు అప్పగించి కేసీఆర్‌ను దెబ్బతీయాలన్నది బీజేపీ యోచనగా తెలుస్తోంది.
తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. వారిని బీజేపీ వైపు మళ్లించాలన్న లక్ష్యం ఈటలకు అప్పగించనున్నారు. ముఖ్యంగా ఈటల సొంత సామాజికవర్గం ముదిరాజ్‌లను బీజేపీకి చేరువ చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన. దేశంలో ఇంతవరకు ఒక్కసారి కూడా బీజేపీ గెలవని ఎంపీ సీట్లలో మరింత పనిచేసి విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. తెలంగాణలోనూ అలాంటి సీట్లున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో ముదిరాజ్‌ల జనాభా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ముదిరాజ్‌లను ఆకర్షించేందుకు ఈటలను ముందుకు తేవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలలో పరాజయానికి బండి సంజయే కారణమంటూ ఆయన వ్యతిరేక వర్గం బీజేపీ కేంద్ర పెద్దల దగ్గర బలంగా చెప్పిందని.. టీఆర్ఎస్‌తో సమానంగా డబ్బు ఖర్చు చేసినా గెలవలేకపోవడాన్ని బీజేపీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. మొత్తానికైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటలను తేవడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates