ఉద్యోగులకు జీతాల్లేవు కానీ జగన్‌కు 19 హైఎండ్ కొత్త కార్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరినడిగినా చెప్పేది ఒకటే… ఉద్యోగులకు జీతాలు లేవు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు లేవు.. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు… అభివృద్ధి పనులకు నిధులు లేవు.. సంక్షేమ పథకాలలో కోతలు.. అంటూ పెద్ద లిస్టే వినిపిస్తున్నారు. అంత ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పుడు కొత్తగా 19 అధునాతన కార్లు కొంటున్నారని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ కార్లు కొత్తగా కొన్నది. మొత్తం 19 హైఎండ్ కార్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చుతోంది. కార్ల కొనుగోలు, బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చడానికి మొత్తంగా రూ. 15 కోట్లకు పైనే ఖర్చవుతుందని చెప్తున్నారు.

నిజానికి జగన్ సీఎం కాగానే ఆయన కోసం 6 కొత్త కార్లు కొన్నారు. తాడేపల్లి ప్రాంతంలో తిరగడానికి, జిల్లాల పర్యటనకు, ఆయన దిల్లీ పర్యటనలలో వాడడానికి వేర్వేరుగా కార్లు కొని పెట్టారు. అవన్నీ ఉండగా ఇప్పుడు ఏకంగా 19 కార్లు కొనడం చర్చకు దారితీస్తోంది.

ప్రభుత్వం కొత్తగా కొన్న 19 కార్లు ఎవరి కోసం.. ఎందుకోసం అనే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఇవన్నీ సీఎం కాన్వాయ్‌గా వాడడానికే అని విమర్శిస్తున్నాయి. ఉద్యోగులు కూడా తమకు జీతాలు వేయడానికి డబ్బులు లేవు కానీ సీఎం కాన్వాయ్ కోసం కార్లు కొనడానికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

ఏప్రిల్ నెల తరువాత జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారన్న ప్రచారం కూడా ఒకటి వినిపిస్తుండడంతో ఆయన ఎన్నికలకు ముందు నియోజకవర్గాలలో పర్యటించే ప్లాన్లో ఉన్నారని.. అందుకోసమే ఈ హెవీ కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారని వినిపిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర.. జనసేన నేత పవన్ కల్యాణ్ తన వాహనం వారాహితో యాత్ర చేయనుండగా… జగన్ కూడా భారీ కాన్వాయ్‌తో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది.