ఆయన ఔట్.. ఈయనకు లాస్ట్ వార్నింగ్

సింహపురి శిరోభారాన్ని వదిలించుకునేందుకు సీఎం జగన్ కొత్త ప్లాన్ రెడీ చేశారు. అలిగి, అవస్థల పాలు చేస్తున్న సొంత పార్టీ నేతలను దారికి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. తమలో తాము కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొందరు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుంటే… మరి కొందరు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంత కాలం తర్వాత దారికి వస్తారులే అని వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. వారి వైఖరి మాత్రం మారలేదు దానితో ఇప్పుడు జగన్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు..

రోజువారీ హాట్ కామెంట్స్ చేస్తున్న మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వదిలించుకోవాలని జగనన్న డిసైడయ్యారు. పనులు జరగడం లేదని, జనం నిలదీస్తున్నారని బహిరంగ ప్రకటనలు చేస్తున్న ఆనంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్న సంకేతాలు కూడా ఆయన బయటకు వదిలారు. నేను ఎమ్మెల్యేనా కాదా అని ప్రశ్నించిన తర్వాత పార్టీలో ఉండనిచ్చి ప్రయోజనం లేదని జగన్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఉదయగిరి ఇంఛార్జ్ బాధ్యతలు నెదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగిస్తారని ఫీలర్లు వదిలేశారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ నెల్లూరులో బలమైనే నేతగా భావించి పార్టీలో చేర్చుకుంటే రాం నారాయణ రెడ్డి రచ్చ రచ్చ చేస్తున్నారని జగన్ తెప్పించుకున్న నివేదికలో వెల్లడైంది. అందుకే ఇప్పటికిప్పుడు ఏమీ చేయకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆపేస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతానికి రాంకుమార్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే ఆనం తిక్క కుదురుతుందని కొందరు ఇచ్చిన సలహాను జగన్ పాటిస్తున్నారు… వచ్చే ఎన్నికల్లో రాంకుమార్ రెడ్డికే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై కూడా జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయన్ను దారికి తీసుకు రావడం ఇబ్బందే కాదని సీఎం భావించారు. అందుకే తాడేపల్లి ప్యాలెస్ కు రప్పించుకుని తలంటి పంపారు. ఇదే ఆఖరి ఛాన్స్ అని… మాట వినకపోతే… రామనారాయణ రెడ్డి గతే మీకు పడుతుందని హెచ్చరించి పంపారు.. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన కోటంరెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. గడప గడవకు కార్యక్రమంలో జగన్ కొన్ని మార్పులు సూచించారని వాటిని పాటిస్తూ ముందుకు వెళతానని చెప్పుకున్నారు. అనారోగ్యంతో కొన్ని రోజులు గడప గడపకు నిర్వహించలేకపోయానని, ఇకపై పూర్తి స్తాయిలో నిర్వహిస్తానని చెప్పుకున్నారు…

ఇద్దరు నేతలను హ్యాండిల్ చేసిన తీరుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మిగతా నేతలు దారికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ సైలెంట్ అయిపోయారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉంటారు. జనం ఎదురుతిరుగుతున్నారన్న నెపంలో మొహం చాటేసిన వారంతా ఇప్పుడు అనివార్యంగా గ్రామాలకు వెళతారు. ప్రభుత్వ పథకాలపై జనానికి వివరణ ఇస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తారు. జగన్ ఇమేజ్ పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు.. జగనన్నకు కావాల్సింది కూడా అదే…