కాలం వడివడిగా కదిలిపోయింది.. క్యాలెండర్ గిర్రున తిరిగిపోయింది! 2022 చరిత్రలో కలిసిపోయింది!! కానీ, జ్ఞాపకాల దొంతరలను తరచి చూస్తే.. కొన్ని అనుభూతులు.. కొన్ని అపవాదులు.. మరికొన్ని ఆవేదనలు.. ఇంకొన్ని ఆనందాలు! వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా.. ఇవన్నీ సర్వసాధారణం. ‘మనవన్నీ.. ప్రైవేటు బతుకులు’ అంటారు మహాకవి శ్రీశ్రీ!! కాబట్టి.. మన విషయాలు పక్కన పెట్టి మనలను పాలించే వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పాలనను ఒక్కసారి వెనుదిరిగి చూస్తే.. కీలకమైన రెండు విషయాలు ఆ పార్టీని రోడ్డున పడేశాయి.
‘మంచి ఎంత ఉన్నా.. చెప్పరా!’ అనే మాట సహజమే.. సాధారణమే. కానీ, తప్పులు తెలుసుకుంటే.. వాటిని మననం చేసుకుంటే.. మరోసారి జరగకుండా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే.. ‘తప్పులు గుర్తించుము’ అని చిన్నప్పటి నుంచి మన పాఠ్యాంశాల్లోనే నేర్పించారు. సో.. ఇప్పుడు ఆ విషయాలను చర్చిస్తే.. వైసీపీ విషయంలో జరిగిన రెండు కీలకమైన తప్పులు.. పార్టీపై తీవ్ర అపవాదు మోపాయి. ‘ఇలా.. కూడా జరుగుతుందా!?’ అని ముక్కున వేలేసుకునేలా అవి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. అప్పట్లో ఇవి సంచలనం కూడా అయ్యాయి. ఒకటి దేశ సరిహద్దుల వరకు కనిపించి.. వినిపిస్తే.. రెండోది దక్షిణాది రాష్ట్రాల్లో చర్చకు వచ్చింది. అందుకే ఈ రెండు ఘటనలకు అంత ప్రాధాన్యం ఏర్పడింది.
1) హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియో. ఎవరో ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఈ వీడియో ఓ రేంజ్‌లో ‘వైరల్’ అయింది. దీనిలో గోరంట్ల మాధవ్ పూర్తి నగ్నంగా కనిపించారు. అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఏకంగా భారత పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. నేషనల్ చానళ్లలో గోరంట్ల ‘న్యూడ్ ఎపిసోడ్’ రోజుల తరబడి ప్రసారమైంది. వెంటనే స్పందించిన వైసీపీ ప్రభుత్వం ఆయన తప్పు ఉంటే తొలగిస్తామని పేర్కొంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఏం జరిగిందో ఆ ‘మాధవు’డికే ఎరుక!!
2) విజయమ్మ రాజీనామా.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా దాదాపు 11 సంవత్సరాల పాటు పార్టీకి సేవలు అందించిన సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ అనూహ్యంగా ఆ పదవికి రాజీనామా సమర్పించడం.. దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జరిగిన వైసీపీ ప్లీనరీ వేదికగా విజయమ్మ వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. విజయమ్మ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వెనుక నుంచి విజయమ్మను ఎవరో పిలిచారు. దీంతో ప్రసంగం ఆపి వెనక్కి తిరిగి వారితో ఆమె మాట్లాడారు.
ఆ తర్వాత ఒక్కసారిగా సభ సైలెంట్ అయిపోయింది. ఆమె తన ప్రసంగం ఆపేశారు. కొద్దిసేపటికి విజయమ్మ ప్రసంగం అందుకున్నారు. ఈ పరిణామానికి ముందువరకు ధాటిగా, అనర్గళంగా మాట్లాడిన విజయమ్మ మాట.. ఆ తర్వాత తడబడింది. తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. ముఖ కవళికలు మారిపోయాయి. మాటల్లో ఆవేదన, కంట్లో కన్నీరు.. వెరసి.. రాజీనామా ప్రకటన!! ‘వెనుక’ ఏం జరిగిందో.. ఎవరికీ తెలియదు. కానీ, ఆమె పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీపై నీలినీడలు పరుచుకునేలా చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates