వైసీపీలో కొందరు ధనవంతులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు మధ్యతరగతికి ఎగువన ఉన్నవారు ఉన్నారు. దీంతో ఎగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వారు ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారు. కానీ, కొందరు వ్యాపారులు మాత్రం(ఒకరిద్దరు మాత్రమే) తమ సొంత నిధులతో ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా.. దీనిని గమనించిన పొరుగు నియోజకవర్గం ప్రజలు వీరిపై ఒత్తిడి తెస్తున్నారనేది టాక్. తాజాగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత నిధులతో అభివృద్ధి బాట పట్టారు.
ఆత్మకూరు నియోజకవర్గానికి తన సొంత నిధులనుంచే రూ.10 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించారు. తన సోదరుడు గౌతం రెడ్డి మరణంతో ఇక్కడ విజయం దక్కించుకున్న విక్రమ్ రెడ్డి.. తనే నియోజకవర్గం అభివృద్ధి చేయాలని నిర్ణయించుకోవడం మంచిదే అయినా.. ఇతర నేతలకు ఇబ్బందిగా మారిందట! ఈ క్రమంలో ఆయనపై కొందరు గుస్సాగా ఉన్నారు. ఇక, మేకపాటి తన సొంత నిధుల నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ఈ నిధితో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసి, ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేయనున్నట్టు ప్రకటించారు.
నియోజవకర్గంలో ముందుగా మౌలిక వసతుల పెంపుతో పాటుగా విద్య, ఉపాధి అవకాశాల కల్పన దిశగా చర్చలు చేసి..నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చి దిద్దనున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. కాగా, అభివృద్ధి గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారనే కారణంగా ఆయన నిధులు వెచ్చిస్తున్నారు.
అయితే.. అన్ని చోట్లా అభివృద్ధి పరిస్థితి ఇలానే ఉంది. మరి ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి చొప్పున ఇస్తానని చెప్పినా.. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఈ పరిణామాలతో నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరి విక్రమ్‌రెడ్డి అంటే.. పారిశ్రామికవేత్త..కనుక వెంటనే రూ.10 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఇది సాధ్యమా? అనేది ఇతర ఎమ్మెల్యేల వాదన.అంతేకాదు.. నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అక్కసు. ఆవేదన కూడా ఇదేనని అంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates