ప్ర‌ధాని మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ క‌న్నుమూత

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇక‌లేరు. ఈ రోజు తెల్ల‌వారు జామున 3 గంట‌ల 30 నిమిషాల స‌మ‌యంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు.

కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న వాద్‌నగర్ లో 1923వ సంవ‌త్స‌రంలో జన్మించిన హీరాబెన్.. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ టీ వ్యాపారం చేసేవారు. ఈ దంపతులకు ప్రధాని మోదీ సహా ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూడో కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న వందవ పుట్టినరోజు జరుపుకున్న హీరాబెన్ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీల్ ఛైర్ లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని హీరాబెన్ స్వాగతించారు. అప్పట్లో నోట్ల రద్దుకు మద్దతుగా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి మరీ పాతనోట్లను మార్చుకుని ప్రజల్లో స్ఫూర్తినింపారు. హీరాబెన్ మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.