నరబలి తో పోల్చిన స‌జ్జ‌ల

దేనినైనా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల దిట్ట వైసీపీ కీల‌క నాయ‌కుడు.. స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఆయ‌న మాట‌లు వేడిగా ఉండ‌క‌పోయినా..వాడిగా ఉంటాయి. ఆయ‌న చించేసుకుని మాట్లాడ‌డు. కానీ, చిరిగిపోయే మాట‌లే ఎక్కువ‌గా ఉంటాయ‌ని పార్టీ నాయ‌కులు అంటుంటారు. తాజాగా టీడీపీ కందుకూరు ఎపిసోడ్‌పై.. ఆయ‌న సుతిమెత్త‌గానే అయినా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబు కావాల‌ని.. ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్‌ బెడిసి కొట్టిందని స‌జ్జ‌ల ఉవ‌చించారు. జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. కానీ, ఆ పబ్లిసిటీకి ఎనిమిది మంది బలయ్యారన్నారు.

‘‘పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా?. అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారు. పైగా పోలీసులపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా?’’ అని చంద్రబాబును నిలదీశారు. ఆ ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహణ ద్వారా.. డ్రోన్‌ షాట్లతో జనాలు బాగా వచ్చారని చూపించుకునే ప్రయ త్నం చేశారు. కందుకూరు తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. 

ఫేస్ రీడింగ్ చేశార‌ట‌..

కందుకూరు ఘటనపై చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపమే కనిపించడం లేదని అంటూ.. ఆయ‌న ఫేస్‌పైనా స‌జ్జ‌ల కామెంట్లు కుమ్మ‌రించారు. బాబులో లెక్కలేనితనం, అహంకారమే కనిపిస్తోందన్నారు. ఈ దుర్ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష నేత యత్నించడం సిగ్గు చేటన్నారు. చంద్ర‌బాబు వికృత విన్యాసంలో ఈ నరబలి జరిగిందని ఘాటు వ్యాఖ్య చేశారు. మొత్తానికి ఒక‌సారి వినేసి.. ప‌క్క‌న పెట్టేసే టైపులో స‌జ్జ‌ల కామెంట్లు ఉన్నాయ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.