గత వారం రోజులుగా వ్యవహారం కొంచెం చల్లబడింది కానీ.. అంతకుముందు ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్. కొన్ని వారాలుగా ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య నడుస్తున్న రగడ గురించి తెలిసిందే. కొంత కాలంగా పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న ఆయన.. ఇటీవల స్వరం పెంచారు.
అధినాయకత్వంతో పాటు పార్టీలో అనేకమంది నాయకుల్ని ఏకి పడేస్తే మీడియాలో హల్‌చల్ చేశారు. పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే దానికి కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చి అధినాయకత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కల్పించారు. రఘురామ కృష్ణంరాజును కట్టడి చేయకపోతే పార్టీలో క్రమశిక్షణ దెబ్బ తింటుందంటూ అంతర్గతంగా పెద్ద ఎత్తున గళాలు వినిపించాయి.
కానీ ఇప్పటిదాకా రఘురాముడిని ఏమీ చేయలేకపోయింది వైకాపా. ఐతే ఇప్పుడు ఆయనకు చిన్న స్థాయిలో ఒక షాక్ ఇచ్చింది. లోక్‌సభలో ఆయన స్థానాన్ని మార్చింది వైకాపా. రఘురామ కృష్ణంరాజుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నాయకులు కూర్చునే వరుసల్లో ఇంతకముందు ఆయనకు ముందు వరుసలో సీటు ఉండేది. దాన్ని వెనక్కి మార్చింది వైకాపా.
లోక్‌సభలో నాలుగో వరుస నుంచి వైకాపా ఎంపీల సీట్లుండగా.. ఇకపై అక్కడి నుంచి రఘురాముడు ఏడో వరుసలో కూర్చోవాల్సి ఉంటుంది. ఆ వరుసలో ఉన్న మార్గాని భరత్‌ను ముందుకు తీసుకొచ్చి.. అతడి స్థానంలో రఘురామ కృష్ణంరాజును కూర్చోబెట్టనున్నారు. ఇంతకముందు ఆయన సాటు నంబర్ 379 కాగా.. ఇకపై 445కి మారనుంది. ఈ పరిణామంపై రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates