వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు కూడా తాను సిద్ధమేనని తాజాగా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పనులు చేయడం లేదని.. అధికారులు ఎవరూ సహకరించలేదని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గతంలో ఉన్న మంత్రి, ఇప్పుడున్న మంత్రి కూడా.. తనకు సహకరించడం లేదని బహిరంగంగానే చెప్పేశారు. తన స్వరం బలంగానే వినిపించారు.
పనులు చేయకపోతే.. రాబోయే రోజుల్లో ఉద్యమించేందుకు కూడా తాను సిద్ధమని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను గమనిస్తే.. అధిష్టానంపై ఆయనకు ఉన్న కోపం.. ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లోనే కాకుండా.. 2014 ఎన్నికల్లోనూ వరుస విజయాలు దక్కించుకోవడమే కాదు.. పార్టీలోనూ బలమైన నాయకుడిగా గళం వినిపించారు. జగన్ కోసం.. ఏమైనా చేస్తామని ఆయన చెప్పిన వ్యాఖ్యలపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి.
ఎంతో సినియర్‌నైన తనను కాదని.. జూనియర్లకు పదవులు పందేరం చేశారంటూ.. ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు పదవి రాని సందర్భంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. అయినప్పటికీ.. అధిష్టానం మాత్రం ఆయనను పట్టించుకోలేదు. పైగా.. బుజ్జగిస్తామని చెప్పిన నాయకులు కూడా వచ్చి.. చూచాయగా మాట్లాడి వెళ్లిపోయారు. దీంతో ఆయనలో ఉన్న ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ పరిణామాలకు తోడు అధికారులు పనులు చేయడం లేదనేది మరో ఆవేదన.
వెరసి.. కోటంరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు. ఇటు పార్టీలోనూ.. ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకు తనకు మిత్రుడుగా ఉన్న మాజీ మంత్రి అనిల్‌తోనూ.. విభేదాలు కొనసాగుతున్నాయి. అటు అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లోనూ అసంతృప్తి ఏర్పడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపై ఆయనకు ఇబ్బంది తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. వీటిని నిశితంగా గమనిస్తున్న కోటంరెడ్డి అధిష్టానమే తన రాజకీయ భవితవ్యాన్ని నాశనం చేస్తోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates