జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మాటేగానీ.. అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పం కనిపించడం లేదు. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు అపసరమైన చర్యలు దాదాపు శూన్యానికి చేరిపోయాయి. ప్రభుత్వోద్యోగాలు ఒట్టిపోతున్న తరుణంలో ఉపాధి అపకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన వైసీపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలనే తరిమేస్తున్న వార్తలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జగన్ పాలనలో అమరరాజా సంస్థకు జరిగిన అవమానం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వారికి రాయితీలు ఇవ్వాల్సిన జగన్ ప్రభుత్వం వాటిని తరిమి కొట్టేందుకే ఇష్టపడుతోంది పైగా పేదలకు ఏదో చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ వారికి మటన్ షాపులు, చేపల మార్కెట్లు, పానీ పూరి చాట్ మసాలా బడ్డీలు కేటాయించి వ్యాపారం చేసుకోవాలని చెబుతూ చేతులు దులుపుకుంటోంది. భారీ పరిశ్రమలు పెడితేనే ఒక్కో చోట ఏకకాలంలో వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిసి కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పైగా ఎవరైనా పెట్టబడులు పెట్టేందుకు వచ్చినా వేసీపీ నేతలు భారీ స్థాయిలో వాటాలు, కమిషన్లు అడుగుతూ బెదరగొట్టి పంపించేస్తున్నారు…
జగన్ ప్రభుత్వ డొల్లతనాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎండగట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రం తూర్పారపట్టింది. ఈఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడుల శాతం 0.5 మాత్రమేనని నిగ్గు తేల్చింది. పైగా దేశవ్యాప్తంగా ఎప్డీఐలు పొందిన రాష్ట్రాల్లో ఏపీ పదో స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిది నెలల కాలంలో ఏపీకి 217 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని కేంద్రం, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లింది. అన్ని రాష్ట్రాలకు మొత్తం 42,509 మిలియన్ డాలర్ల పెట్టుబడి రాగా… అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత కర్నాటక, ఢిల్లీ ఉన్నాయి. 1287 మిలియన్ డాలర్లతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. అంటే తెలంగాణకు ఏపీకి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు…