ఏపీ మంత్రి అంబటికి కష్టకాలం వచ్చేసింది. ఆయనపై ఆరోపణలు రావటం.. తనకున్న వాయిస్ బేస్ తో తన మీద వచ్చే విమర్శల్ని.. ఆరోపణల్ని కొట్టిపారేస్తుంటారు. అదే సమయంలో అధినేతకు నచ్చిన రీతిలో రాజకీయ ప్రత్యర్థులపై మసాలా గుప్పించి మరీ విమర్శలు చేస్తూ మనసును దోచేస్తుంటారు. అలాంటి ఆయనకు.. ఆయన్ను అభిమానించే సీఎం జగన్ కు కష్టకాలం వచ్చినట్లుగా చెప్పక తప్పదు. తాజాగా ఒక ఉదంతంలో చిక్కుకుపోయిన అంబటి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.
ఒక కార్మికుడి మరణం నేపథ్యంలో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి సాయంగా బాదితుడికుటుంబానికి అందగా.. ఆ డబ్బులు చేతికి రావాలంటే మంత్రి అంబటి రూ.2.5 లక్షలు అడిగారన్న ఆరోపణలు వచ్చిన రెండు రోజులు కావటం.. ఈ ఇష్యూ పెను సంచలనంగా మారటం తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ లో తాజాగా బాధితుడి తల్లితండ్రి ఇద్దరు తమ కుమార్తె మీద ఒట్టేసి మరీ ప్రమాణం చేయటం.. తాము చేస్తున్న ఆరోపణలు నిజమని.. మంత్రి అంబటి తమను లంచం అడిగినట్లుగా వారు పేర్కొన్న వైనం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
చనిపోయి.. పుట్టెడు శోకంలో ఉన్న బాధితుడి కుటుంబాన్ని మరింత వేదనకు గురి చేసేలా మంత్రిఅంబటి వ్యవహరించారని.. వచ్చిన పరిహారంలో సగం తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఇప్పటికే బాధిత కుటుంబం వీడియోలో వెల్లడించటం తెలిసిందే. అయితే.. ఈ ఆరోపణను అంబటి తీవ్రంగా కొట్టేశారు. ఊహించని విధంగా అంబటి తమను డబ్బులు అడిగారన్న బాధితులు అక్కడితో ఆగకుండా.. తమ కుమార్తె మీద ఒట్టు వేయటంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిన పరిస్థితి.
ఆరోపణలు రావటం.. ఆ వెంటనే రియాక్టు అయి డ్యామేజ్ కంట్రోల్ చేసే దానికి భిన్నంగా తాజా పరిస్థితి ఉందంటున్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు.. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని.. రానున్నది ఎన్నికల కాలమని ప్రజలు గమిస్తుంటారని తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా తాను ఓపెన్ అయ్యాక బయటకు వచ్చిన అంబటి వ్యవహారంలో ఆయన ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఆరోపణల బురదలో నిండా మునిగిపోయిన అంబటి విషయంలో సీఎం జగన్ కఠినంగా వ్యవహరిస్తారా? చూసి చూడనట్లుగా ఉంటారన్నది ఒక ప్రశ్న. ఈ రియాక్షన్ ఆధారంగానే జగన్ మాటలకు విలువ ఉంటుందని చెబుతున్నారు. తాను ఇరుక్కుపోవటమే కాదు.. సీఎం జగన్ ను సైతం అంబటి ఇరికించేశారన్న విమర్శ వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates