భాగ్యనగరంపై దేశం నేత గురి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణపై గురి పెట్టారు. 2023 ఎన్నికల్లో తెలంగాణను ఓ పట్టుపట్టాలనుకుంటున్న దేశం అధినేత హైదరాబాద్లో విజయవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తీరుపై సెటిలర్లతో పాటు తెలంగాణ జనం కూడా విసుగు చెందారని గ్రహించిన చంద్రబాబు.. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. హెదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నియోజవర్గాల ప్రజల్లో టీడీపీపై విశ్వాసం కలిగించేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు..

రాజధానిలో భారీ సభ

హైదరాబాద్ మహానగరంలో టీడీపీ త్వరలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. కనీ వినీ ఎరుగుని రీతిలో జన సమీకరణ చేయాలని భావిస్తోంది. ఈ బాధ్యతను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు అప్పగించారు. హైదరాబాద్ సభ సాధారణ ఓటర్లను ఆకర్షించేదిగా ఉంటూనే, బీసీ ఓటర్లలో నమ్మకం పెంచేదిగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారట. సభ నిర్వహించే తేదీ ఖరారైన తర్వాత ఏర్పాట్లను తానే స్వయంగా రోజువారీ పర్యవేక్షిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పార్టీ తెలంగాణ యూనిట్లో జోష్ పెరిగింది..గతంలో పార్టీ నిర్వహించిన సింహ గర్జన తరహాలో హైదరాబాద్ సభ ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు..

బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగ సభ

ఖమ్మం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం సభకు వెళతారు. రసూల్ పురా జంక్షన్లో ఎన్టీయార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత మార్గమధ్యంలో చాలా మందిని కలుస్తూ ఆయన ఖమ్మం చేరుకుంటారు, ఖమ్మం సభకు మూడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. యువత భారీ సంఖ్యలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనానికి ఖమ్మం సభ నాంది పలుకుతుంది..

వేర్వేరు నగరాల్లో టీడీపీ సభ

ఖమ్మం సభతో టీడీపీ కార్యకర్తల్లో ఊపు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం తర్వాత నిజామాబాద్, వరంగల్ , మహబూబ్ నగర్ సభలు ఉంటాయి. వాటికి కూడా ఖమ్మం తరహాలోనే భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ సభను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు బహిరంగ సభను వినియోగించుకోవాలని నిర్ణయించారు..