కరోనా అంత్యక్రియలకు ప్యాకేజీ…ఏజెన్సీల నయా బిజినెస్

ప్రజల జీవితాలలో కరోనా కల్లోలం రేపింది. కరోనా మనందరికీ కొత్త జీవిత పాఠాలు నేర్పుతోంది. మానవత్వం కనుమరుగవుతున్న రోజుల్లో కొందరిలోనైనా అది మిగిలుందని నిరూపించే ఘటనలూ కరోనా కాలంలో చూశాం. ఇక, కరోనా భయంతో రక్తసంబంధీకులకు కడసారి వీడ్కోలు పలికేందుకూ ముందుకు రాని కర్కశ హృదయులను చూశాం. కరోనా ప్రభావంతో చాలా చోట్లు కట్టుబాట్లు మారాయి….పద్ధతులు మారాయి. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాలనూ పక్కనబెట్టి మరీ అంత్యక్రియల తంతును ముగించే పరిస్థితిని కల్పించింది కరోనా. కరోనా సోకి చనిపోయిన వారిని కాటికి సాగనంపేందుకు కుటుంబ సభ్యులూ వెనకాడుతున్న పరిస్థితుల నుంచి ఓ కొత్త వ్యాపారం పుట్టుకువచ్చేలా చేసిందీ కరోనా. మహమ్మారి వైరస్ సోకి చనిపోయిన వారి అంత్యక్రియల పూర్తి చేసేందుకు కొత్తగా ఏజెన్సీలు పుట్టుకువచ్చేలా చేసింది కరోనా.

కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల సమస్యకు కొత్తగా వచ్చిన ఏజెన్సీలు పరిష్కారం చూపుతున్నాయి. కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబీకులకు ఏజెన్సీ వారు ఫోన్ చేసి ప్యాకేజీ గురించి వివరిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తామని, ఎటువంటి లోటు జరగదని హామీ ఇస్తున్నారు. ఒక్కో మృతదేహం అంతిమ సంస్కారాలకు రూ.30 వేలు ఫీజు వసూలు చేస్తున్నాయి ఏజెన్సీలు. కరోనా నిబంధనలు, సంప్రదాయాలు పాటిస్తూనే అంత్యక్రియలు పూర్తి చేసి..చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేస్తున్నాయి సదరు ఏజెన్సీలు. ఎవరన్నా కుటుంబీకులు అంత్యక్రియల్లో పాల్గొనాలంటే ఐదుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారంతా అదనంగా రూ.1200 చెల్లించి పీపీఈ కిట్లు ధరించి రావాల్సిందే.

కరోనా మహమ్మారి దెబ్బకు జనజీవనం అతలాకుతలమవుతోంది. కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ వైపు బ్రతుకీడుస్తుంటే…కరోనా సోకి చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఇక, కరోనా బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. కరోనా సోకి చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులు, గ్రామస్థులు కూడా ముందుకు రాని పరిస్థితులున్నాయి. ఇక, .క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చిన కొందరు కుటుంబ సభ్యులకు తమవారిని కడసారి చూసుకునే అవకాశం కూడా లేదు. తమ వారి అంత్యక్రియలు ఎలా జరిగాయోనన్న బెంగ వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

ఇక, భయపడుతూ అంత్యక్రియలు నిర్వహించడం ఎందుకని…మానవత్వం, రక్త సంబంధం మరిచిపోయి…తమవారిని అనాధ శవాలుగా వదిలేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కరోనా సోకి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రైవేటు ఏజెన్సీలు పుట్టుకు వచ్చాయి. ఆసుపత్రి నుంచి శవాన్ని తీసుకువెళ్లింది మొదలు…చితా భస్మం చేతికి వచ్చేవరకు ఓ ప్యాకేజీని ఫిక్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ఏజెన్సీల పుణ్యమా అంటూ తమ వారి అంత్యక్రియలు పద్ధతి ప్రకారం నిర్వహించుకునే అవకాశం కొందరికి దక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రి నుంచి శ్మశానం వరకు కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాన్ని తరలించినందుకే ప్రైవేటు అంబులెన్స్ వారు రూ.30 వేలు చార్జ్ చేస్తున్నారు. అటువంటిది, ఈ ఏజెన్సీలు రూ.30వేలకే అంత్యక్రియలు పూర్తి చేయడం విశేషం.