జనసేనా నాయకుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచబోతున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర మొదలు పెడతారు. అందుకోసం వాహనాన్ని సిద్ధం చేశారు ఆయన వాహనం వారాహిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ పటాపంచలైపోయాయి. తెలంగాణ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ కూడా చేసింది. అయినా కొందరు ఏపీ మంత్రుల ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. ఎవరేమనుకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని పవన్ చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నానంటున్నారు. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి…
వారాహికి కొండగట్టులో పూజలు
ఉత్తర తెలంగాణ ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆ ప్రాంత వాసులు భక్తితో కొలుస్తారు. ఇటీవలే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ వంద కోట్ల ఫండ్ ప్రకటించారు. పవన్ కూడా కొండ గట్టు అంజన్న భక్తుడే. గతంలో కొండగట్టు దేవాలయం అభివృద్ధికి ఆయన 11లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మరోవైపు తన ప్రచార రథం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూరైనందున త్వరలో కొండగట్టులో వాహనపూజ నిర్వహించాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. అంజన్నకు మొక్కుకుంటే అంతా మంచే జరుగుతుందని జనసేనాని విశ్వాసం. పూజల పూర్తయిన తర్వాత మంచి రోజు చూసుకుని ఏపీ టూర్ కు బయలుదేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. . నిజానికి తెలంగాణలో కూడా టూర్ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఏపీ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెడతారు…
తెలంగాణలో పోటీపై దృష్టి
ఇక తెలంగాణను కూడా ఒక పట్టు పట్టాలని పవర్ స్టార్ అనుకుంటున్నారట. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడ్తున్నకొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వరుసగా మూడోసారి అధికారం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు తెలంగాణలో విశేష స్పందన వచ్చింది. ఇంకోవైపు తెలంగాణలో కాషాయ జెండా పాతాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అదలా ఉండగానే బీఎస్పీ, వైఎస్ షర్మిలు సైతం రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవటానికి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కూడా పోటీచేయబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో నియోజకవర్గాల వారీగా తమకు ఐదు వేల వరకు ఓట్లున్నాయని పవన్ గతంలో ప్రకటించారు. ఇప్పుడాయన ఆ నియోజకవర్గాలను గుర్తించే పనిలో ఉన్నారు. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలకు జనసేన కార్యనిర్వాహకులను ప్రకటించింది. తెలంగాణలో జనసేన 30 నియోజకవర్గాల వరకు పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. నిజమో కాదో చూడాలి..