రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకమని.. వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ .. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది? అనే అంశాలపై..సజ్జల స్పందించారు. అప్పట్లోనే రాష్ట్ర విభజనను వైసీపీ వ్యతిరేకించిందని, 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉండాలనేది వైసీపీ విధానమని సజ్జల చెప్పారు.
రెండు రాష్ట్రాలను కలిపి ఉంచేందుకు వైసీపీ సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తుందని సజ్జల చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తున్నమని చెప్పారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది తామేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. సుప్రీంకోర్టులోనూ.. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు.
విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామని సజ్జల తెలిపారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని.. రెండు రాష్ట్రాలను కలిపివేయాలని కోరారు. లేదంటే విభజన జరిగిన తీరును సరిది ద్దాలని గట్టిగా కోరతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని సజ్జల చెప్పారు.
రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారని, దీనిపై తమ వాదనలు తప్పకుండా వినిపిస్తామని సజ్జల చెప్పారు. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికీ సీఎం జగన్ కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసేందుకు వైసీపీ పోరాటం చేస్తోందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates