“రాజకీయంగా మనం తిట్టుకుందాం.. కానీ, జీ20 వంటి కీలక సమయంలో కలిసి పనిచేద్దాం”- ఏపీ సీఎం జగన్ చెప్పిన మాట ఇది!! ఆచరణలో ఇది సాధ్యమా కాదా.. అనేది పక్కన పెడితే.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టారనే కామెంట్ అయితే వినిపించింది. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. అందివచ్చిన అవకాశాన్ని కూడా ఆయన దూరం చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రధాని మోడీపై కేసీఆర్‌కు ఇప్పుడు పీకల దాకా కోపం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మహబూబాబాద్ లో జరిగిన సభలోనూ మోడీపై విమర్శలు గుప్పించారు. అయితే.. రాజకీయాల్లో రెండు వైపులా పదును ఉండాలనేది కేసీఆర్‌కు తెలియంది ఏమీకాదు. కానీ, ఆయన ఒకవైపే చూస్తుండడం ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.
త్వరలోనే టీఆర్ఎస్‌ను.. బీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రకటన చేసి నా.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయినా.. సరే..వచ్చే ఎన్నికల నాటికి పార్టీని జాతీయస్థాయిలో పుంజుకునేలా వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో రాణించాలంటే..కొన్ని కొన్ని విషయాల్లో కేసీఆర్ పట్టువిడుపులు ప్రదర్శించాలని అంటున్నారు పరిశీలకులు.
జీ20 అనేది మోడీ వ్యక్తిగత విషయం కాదు. దేశవ్యాప్తంగా మేధావులు.. విద్యావేత్తలు, విద్యార్థులు.. సామా న్యులకు కూడా సంబంధించిన విషయంగా మారింది. ఇలాంటి కీలక సమావేశానికి కేసీఆర్ హాజరై.. తన దైన విజన్‌ను ప్రకటించి ఉంటే ఆ ఇమేజ్ వేరుగా ఉండేదని అంటున్నారు. అదేసమయంలో ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. వీరిని కలుసుకునే అవకాశం ఉంది.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారనే చర్చను మరింత పెంచే ఛాన్స్ కూడా ఉంది. అయితే..కేసీఆర్ మాత్రం తన పట్టును కొనసాగించారు. ఇలా చేయడం వల్ల రేపు జాతీయ రాజకీయాల్లో ఆయన ఎలా పుంజుకుంటారనేది ప్రశ్న. మోడీకి బద్ధ శత్రువుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం వచ్చారంటే.. జీ20 వేదికను మిస్ చేసుకుంటే ఇబ్బందని గుర్తించబట్టే కదా! అంటున్నారు పరిశీలకులు.