పేరు బీసీలది.. భజన జగన్‌ది! ఇదీ.. ఇప్పుడు వైసీపీ నాయకులు విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభపై నెటిజన్లు చెబుతున్న అభిప్రాయం. బీసీల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఆద్యంతం జగన్ నామస్మరణే వినిపించింది. నేతల నోటి వెంట జగన్ భజనే మార్మోగింది. నువ్వంత.. నువ్వింత.. అంటూ నాయకులు జగన్‌ను ఆకాశానికి ఎత్తేసినంత పనిచేశారు.
ఎవరెవరు ఏమన్నారంటే..
మంత్రి సీదిరి అప్పలరాజు: సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత బీసీలదే.
ఎమ్మెల్సీ పోతుల సునీత: సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగింది. బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలి. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలి. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్‌నే మళ్లీ సీఎంగా చేసుకుందాం దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలి.
మంత్రి జోగి రమేష్: వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85 వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. జగనన్న వెంట నడుద్దాం. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు.. జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెలిపించి బీసీల సత్తా చాటుదాం.
మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్: బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు. చంద్రబాబు డీఎన్ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం.
మంత్రి ఉషా శ్రీ చరణ్: బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్. పూలేకి సరిసమానమైన నేత జగన్. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates