దూకుడు పెంచబోతున్న కాషాయ సేన 

రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచబోతోందా ? రాబోయే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకుంటుందా ? ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర సంస్థలను తెగవాడేస్తుందా ? బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ కూడా అంతే దూకుడుగా ముందుకెళ్లారా… ?

గుజరాత్, హిమాచల్ లో బీజేపీ విజయాన్ని సూచిస్తున్న సర్వేలు 
ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపే…
ఇకపై దూకుడు పెంచబోతున్న బీజేపీ 
2023లో పదికి పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు 
పార్టీలను చీల్చడంపై ప్రత్యేక దృష్టి
ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐ, ఐటీ నజర్
బీజేపీని కట్టడి చేసే చర్యల్లో కేసీఆర్ దూకుడు ?
గులాబీ దళపతి ముందస్తుకు వెళ్లే అవకాశం 

దేశ రాజకీయ గతిని మార్చే అవకాశం ఉన్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ జయభేరీ మోగిస్తుందని అన్ని సర్వేలు నిగ్గు తెచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతున్నప్పటికీ… బీజేపీకే ఎడ్చ్ ఉందనడంలో సందేహం లేదు. గెలుపుపై బీజేపీకి ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ… పోస్ట్ పోల్స్ ఆ పార్టీకి మరింత ధైర్యాన్నిచ్చాయి. ప్రధాని మోదీ పరపతి కూడా అమాంతం పెరిగిపోతుందనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాలైనా గుజరాత్ ప్రజలకు మోదీ పట్ల అభిమానం ఏ మాత్రం తగ్గలేదని కూడా చెప్పుకోవాలి. గుజరాత్లో వరుస ఏడో సారి గెలుస్తున్న బీజేపీ ఇకపై బ్యాటింగ్ వేగాన్ని పెంచుతుందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.. 

వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. దక్షిణాదిన కర్ఠాటక, తెలంగాణ, ఉత్తరాదిన ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఐదు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం 2023లో ముగుస్తుంది. ఆయా రాష్ట్రాలకు వరుసగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో విజయం కోసం బీజేపీ సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తుంది. ఇప్పటికీ మోదీ నాయకత్వాన్ని చూసి ఎన్నికల్లో ఓటేయ్యాలని బీజేపీ కోరుతోంది. ఇకపై జరిగే ఎన్నికల్లో కూడా అదే మొదటి అస్త్రం కావచ్చు. దానికి తోడు తన అమ్ములపొదిలో పదిలంగా ఉన్న మరికొన్ని అస్త్రాలను కూడా బీజేపీ బయటకు తీస్తుందనే చెప్పాలి. ప్రత్యర్తులపై ఆరోపణలు దూకుడును మరింతగా పెంచాలని బీజేపీ పెద్దలు తీర్మానించి చాలా రోజులైంది. ప్రతీ రాష్ట్రంలో ప్రాంతీయ అంశాలనే కాకుండా స్థానిక అంశాలను సైతం రాష్ట్రసమస్యలుగా ప్రతిబింబిస్తూ ప్రచారానికి దిగాలని బీజేపీ కొత్త ఫార్ములాను రూపొందించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అదనపు ఇంఛార్జులను నియమించాలని కూడా మోదీ, షా, నడ్డా గ్రూప్ డిసైడైంది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. 

బీజేపీ అసలు దూకుడు కేంద్ర దర్యాప్తు సంస్థల వైపు నుంచి రానున్నదనే చెప్పాలి. ఈడీ, సీబీఐ, ఐటి శాఖల అధికారులు అన్ని రాష్ట్రాల్లో రోజువారీ విపక్ష పార్టీల రాజకీయ నాయకుల ఇళ్లముందు ప్రత్యక్షమవుతున్నారు. మూడు సంస్థలు ముప్పేట దాడులతో నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలో ఈ పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనకు తెలిసిన ఉదాహరణలు మాత్రమే. దాదాపుగా పేరున్న ప్రతినాయుకుడిని కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదోక కేసులో చేర్చుతూ విచారణకు పిలుస్తున్నాయి. జనవరి నుంచి ఈ ట్రెండ్ వేగం పెరుగుతుందని చెబుతున్నారు. సీబీఐ కంటే ఈడీకి ఎక్కువ పని చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మనీలాండరింగ్ వ్యవహారాలు బయట పడతాయి. ప్రత్యర్తుల ఆర్థిక ముూలాలపై దెబ్బకొట్టడమే బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. ఆ పని సమర్థవంతంగా చేయగలిగితే ఎన్నికల నాటికి వారి దగ్గర నిధులు తగ్గిపోతాయి. తాము ఎక్కువ ఖర్చుపెట్టి గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ విశ్వసిస్తోంది… 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చడానికి కూడా బీజేపీ వెనుకాడదు. ఎన్నికల నాటికి రాష్ట్రప్రభుత్వం తమ చేతిలో ఉండాలన్నది ఆ పార్టీ ధ్యేయం. ముందుగా మధ్యప్రదేశ్, ఇటీవల మహారాష్ట్రలో ఆ దిశగా బీజేపీ విజయం సాధించింది. కర్ణాటకను లాగేసుకుని చాలా రోజులైంది. ఇటీవలే తెలంగాణలో చిన్న ప్రయోగం చేసి విఫలమైన బీజేపీ, తన ప్రయత్నాలను మానుకునే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు వేరే మార్గం వెదకడం ఖాయమనే చెప్పాలి. రాజస్థాన్లోనూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలో ఓ సారి ప్రయత్నించగా… సచిన్ పైలట్ ను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం రాజస్తాన్లో నెలకొన్ని అంతర్గత కుమ్ములాటతో గెహ్లాట్ , పైలట్లో ఒకరు బయటకు వెళ్లిపోతారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వారిని దగ్గరకు చేర్చుకునేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. 

బీజేపీ ఎత్తుగడలు తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతకంటే ఎక్కువ దూకుడును ప్రదర్శించబోతున్నారని సమాచారం. కమలం నేతలు ఒక ఆరోపణ చేస్తే ఆయన రెండు ఆరోపణలు చేస్తున్నారు. కాషాయ పార్టీ ఒక అడుగు ముందుకేస్తే ఆయన నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. బీజేపీ దూకుడును అరికట్టడంతో పాటు తాను రాజకీయంగా లబ్ధి పొందేందుకు గులాబీ దళపతి .. నేరుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునే లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్బంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది…