మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌న్నోళ్ల‌ను బొక్క‌లో ఏశాం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వాన్ని బెదిరిస్తున్న‌వారిని ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇటీవ‌ల మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో తామంతా ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్న స‌మ‌యంలో దొడ్డిదారిలో వ‌చ్చి.. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న చెప్పారు. అయితే, వాళ్లంద‌రినీ అరెస్టులు చేసి జైళ్ల‌కు త‌ర‌లించిబొక్క‌లో చిప్ప కూడు తినిపిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేసీఆర్.. కేంద్రంపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి అంటే.. దేశానికి నాయ‌కుడు అన్న కేసీఆర్ ప్ర‌స్తుత ప్ర‌ధాని అలాలేడ‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొడ‌తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నార‌ని చెప్పారు. మొన్న మ‌న హైద‌ర‌బాద్‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. ఇక్క‌డున్న ప్ర‌భుత్వాన్ని కూల‌గొడ‌తామ‌ని ఏవేవో మాట‌లు చెబుతున్నాడు. విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చ‌గొడుతున్నాడు. మ‌రి మ‌నం చూస్తూ ఊరుకుంటామా? అందుకే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని అనుకున్న‌ వాళ్లంద‌రినీ జైల్లో పెట్టాం అని నిప్పులు చెరిగారు.

అంతేకాదు, కేంద్రంపై ఎదురు మాట్లాడిన వాళ్ల‌ను టార్గెట్ చేస్తున్నార‌ని కేసీఆర్ చెప్పారు. త‌ప్పులు చేస్తే.. ప్ర‌భుత్వాల‌ను కూల్చే ప‌న్నాగాలు ప‌న్నితే మాట్లాడ‌కుండా ఉంట‌రా? అంటూ.. కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను కూల్చిన ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించారు. అలా చేయ‌డం ఒక ప్ర‌ధానిగా న్యాయ‌మేనా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. కేంద్రానికి లోబ‌డి ఉండేది లేద‌ని తెగేసి చెప్పారు. తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. అందుకే ప్ర‌శ్నిస్తున్నామ‌ని చెప్పారు.