తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అద్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం ఇదేనా ? అని నిలదీశారు. “సామాజిక న్యాయం అంటే నాలుగు కులాలకు చెందిన ‘తన’ అనుకున్నవారికి మంత్రి పదవులు ఇచ్చి వారిని పక్కన కూర్చోబెట్టుకోవడమేనా?” అని రేవంత్ నిలదీశారు. ఆధిపత్య రాజకీయాలను ఎండగట్టిన తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు.
తెలంగాణ అనగానే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ అని రేవంత్ తెలిపారు. ఈ యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్రం కోసం ఎంత కైనా పోరాడారని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్‌పైనా.. ఆయన చేస్తున్న రాజకీయాలపైనా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఏర్పడిన చాలా ఏళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందన్నారు. తెలంగాణ.. ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదని తెలిపారు.
ఉద్యమకారులు ఎవరో, ఆ ముసుగులో దోచుకుంటున్నది ఎవరో అందరి తెలిసిందేనని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను, వారి ఆకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని రేవంత్ గుర్తు చేశారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి టీఆర్ఎస్ గద్దెనెక్కిందన్నారు. 1200 మంది కుటుంబాల త్యాగాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు ఏం చేసిందని నిలదీశారు.
అంతేకాదు.. కనీసం 550 కంటే ఎక్కువ మంది అమరుల కుటుంబాలను గుర్తించేందుకు కూడా కేసీఆర్ ప్రబుత్వానికి మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ఉద్యమకారులు, త్యాగధనుల అడ్రస్ తెలియదని ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? అని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? అని నిలదీశారు.
తెలంగాణ సాధించుకుంది కేసీఆర్ కుటుంబం, బంధువులు బాగుపడటానికేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో అన్యాయమే జరుగుతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.