తెలంగాణ రాజకీయాలలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు తనకు ఎన్ని అవాంతరాలు కల్పించాలని చూసినా పాదయాత్ర కొనసాగించి తీరుతానని, డిసెంబర్ 14వ పాదయాత్ర ముగుస్తుందని షర్మిల బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే, షర్మిల ఆరోపణల్లో నిజం లేదని, షర్మిల…కేసీఆర్ వదిలిన బాణం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.
జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఓవైపు షర్మిలను ఆరెంజ్ ప్యారట్ అని, ఆమె బిజెపి వదిలిన బాణం అని ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీకి, టీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్, కవితలపై షర్మిల చాలా కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
కానీ, కేసీఆర్ పై ఈగ వాలనివ్వని టీఆర్ఎస్ నేతలు….షర్మిలపై మాత్రం అరకొర నామ మాత్రపు విమర్శలు చేసి సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ చెప్పడంతోనే వారు మౌనంగా ఉన్నారని, సరైన సమయం రాగానే షర్మిలన టార్గెట్ చేసేలా కేసీఆర్ వ్యూహం రచించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లు షర్మిలపై విమర్శలు వద్దని కేసీఆర్ ఆదేశించారని, అందుకే గులాబీ నేతలు ఎవరు షర్మిలను పల్లెత్తు మాట అనలేదని మరో టాక్ ఉంది.
అయితే, గత కొద్దిరోజులుగా షర్మిలపై టిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె కాన్వాయ్ లోని బస్సుకు నిప్పు పెట్టడం, కారు అద్దాలు ధ్వంసం చేయడం, ఆమె సమైక్యవాది అని, ఆంధ్రా నేత అని ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నించడం వంటి పరిణామాలు చూస్తుంటే…కేసీఆర్ చెప్పిన ఆ సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉండడం, బీజేపీ కాస్త బలపడేలా కనిపించడం, ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడం వంటి కారణాల నేపథ్యంలో షర్మిలను టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ రెడీ అయిందని టాక్.
మిగతా విషయాలను పక్కదోవ పట్టించేందుకే షర్మిల ఇష్యూను బాగా హైలైట్ చేస్తున్నారని మరో ప్రచారం నడుస్తోంది. ఇక, షర్మిల ఆంధ్రా వ్యక్తి అని లోకల్-నాన్ లోకల్ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలన్నది కూడా టీఆర్ఎస్ నేతల ఆలోచనగా కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల…కేసీఆర్ వదిలిన బాణమేనని, అందుకు తాజా పరిణామాలే ప్రూఫ్ అని కాంగ్రెస్ నేతలతో పాటు బిజెపి నేతలు కూడా గట్టిగా వాదిస్తున్నారు.