జగన్ తప్పు బాబు చేయరట..

ఒకరు చేసిన తప్పును మరొకరు చేయటంలో అర్థం లేదు. ఈ విషయంలో ఉన్న సందేహాలకు తన తాజా మాటలతో ఫుల్ స్టాప్ పెట్టేశారు టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు పథకాల పేర్లు మార్చటంతో పాటు.. వర్సిటీ పేర్లు మార్చటం తెలిసిందే.

దీంతో.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మార్చిన పేర్లను పునరుద్ధరిస్తామంటూ పలువురు టీడీపీ తమ్ముళ్లు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను తలుచుకుంటే కడప జిల్లా పేరును మార్చలేనా? అన్న ప్రశ్నను సంధించారు.

అయితే.. సీఎం జగన్ మాదిరి తాను చేయనన్న క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు.. జగన్ హయాంలో మారిన పేర్లకు మార్పులు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. వైఎస్ పేరు మీద ఉన్న కడప జిల్లా పేరును కూడా మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పేర్లు మార్చటం గొప్ప కాదన్న ఆయన.. తనకు సంస్కారం ఉందని చెప్పుకొచ్చారు. తాను పవర్లోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చే అవకాశం ఉన్నా.. కడప జిల్లా విషయంలో ఆ పని చేయనని స్పష్టం చేసేశారు. దీంతో.. ఒక దుష్ట సంప్రదాయానికి తెర దించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని చెప్పాలి.

అధికారం ఎవరికి శాశ్వితం కానప్పుడు.. ఎవరి చేతిలో పవర్ ఉంటే అందుకు తగ్గట్లు వ్యవహరించే తీరుతో లేనిపోని చికాకులు.. ఇబ్బందులు సహజంగా వస్తుంటాయి. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. రాబోయే కొత్త ప్రభుత్వాల పని తీరుఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే భారీగా ప్రచారం జరుగుతోంది.

విపక్ష నేతలు సైతం తాము అధికారంలోకి వచ్చాక ఏమేం చేస్తామన్న విషయాన్ని చెప్పేసిన తీరు చూసినప్పుడు.. ఏపీలో పాలన కంటే కూడా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ ను అశాంతి ప్రదేశ్ గా రాజకీయాలు మార్చేస్తాయా? అన్న సందేహాలకు గురయ్యే పరిస్థితి. తాజాగా చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ చూసిన తర్వాత.. తమ పాలనలో తాము పాలించే తీరు ఎలా ఉంటుందన్న విషయంపై క్లారిటీ రావటంతో పాటు.. కొన్ని దుష్ట సంప్రదాయాలకు తాను తెర వేస్తానన్న విషయాన్ని టీడీపీ అధినేత స్పష్టం చేశారని చెప్పాలి.