జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీతో కలసి పోటీ చేయనున్నారని.. ఎన్నికలకు ముందు వీరి మధ్య వెడ్ లాక్ సిద్ధం కానుందని వైసీపీ కీలక నాయకుడు, సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు అవకాశం కల్పించాయి. ఎందుకంటే.. ఇప్పటి ఇటీవల కాలంలో చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్.. తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యాక.. టీడీపీ విషయాన్ని ఆయన పట్టించుకోవడం పక్కన పెట్టేశారు.
కనీసం టీడీపీ ప్రస్తావన కూడా లేకుండానే రెండు చోట్ల పవన్ ప్రసంగించారు. దీనిని బట్టి.. పవన్ ఒంటరిగా వెళ్లడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక, బీజేపీ నాయకులు మాత్రం తమతో తప్ప పవన్ ఎవరితోనూ కలిసి పోటీ చేయరని.. పార్టీ కేంద్ర నాయకత్వం ఈ దిశగా పవన్‌ను కూడా ఒప్పించిందని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే, పవన్ తన ప్రసంగాల్లో బీజేపీ మాటను కూడా ప్రస్తావించడం లేదు. తనే ఒంటరిగా ప్రయాణం చేస్తాననే సంకేతాలు పంపుతున్నారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా సజ్జల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పనిచేయడం ఖాయమనే సంకేతాలు తమకు అందాయన్నారు. అంతేకాదు.. పవన్ 30 సీట్లు అడుగుతున్నారని అన్నారు. దీనికి టీడీపీ మాత్రం 15 అసెంబ్లీ సీట్లు ఒకటి లేదా రెండు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అయిందని తమకు పక్కా సమాచారం ఉందన్నారు.
మరి దీనిలో నిజమెంత? అనేది చర్చకు దారితీస్తోంది. ఉభయ గోదావరిజిల్లాల్లో మొత్తం సీట్లు దాదాపు 30కి పైగానే ఉన్నాయి. ఇక్కడ జనసేన తరఫున పోటీ చేసేందుకు 20 మందిరెడీగా ఉన్నారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు రిజర్వ్ చేశారు. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తీసుకుంటే.. ఇక్కడ కూడా 20 మంది అభ్యర్థలుఉ సిద్ధంగానే ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో కేవలం 30 స్థానాలు మాత్రమే పవన్ అడిగారని ఎలా అనుకోవాలి?
అయితే.. వైసీపీ నేతలు చెబుతున్న ఈ విషయంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ విషయంలో ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారనే సందేహాలు వస్తున్నాయి. పవన్ ఒంటరిగా పోటీ చేస్తారని.. కాపు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలపైనే వైసీపీ గేమ్ ఆడుతోందనే వాదన వినిపిస్తోంది. పవన్ ఒంటరి కాదు.. ఎప్పటికైనా టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనేది ఈ వ్యూహం. ఇలా చేయడం ద్వారా .. పవన్‌ను డ్యామేజీ చేయాలనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడగా ఉందని చెబుతున్నారు పరిశీలకులు. అందుకే సీట్ల లెక్కను తెరమీదికి తెచ్చారని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates