ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్.. ప్రతిపక్ష పార్టీలను తర్జన భర్జనకు గురి చేస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే.. ఇంతలోనే వైసీపీ ఎన్నికల హడావుడిని ప్రారంభించేసింది. సీఎం జగన్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. ఆయన ప్రసంగాలు ఎన్నికలను తలపిస్తున్నాయి. నన్ను చూసి, నా పాలనను చూసి ఓటేయండి ఆయన పిలుపునిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఇలా పిలుపునివ్వడంఇతర పార్టీలను ఆలోచనలో పడేస్తోంది. ఏమో.. ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారేమో.. అని ఆయా పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి ఈ ఒక్క విషయమే కాదు.. సీఎం జగన్ చేస్తున్న హడావుడి పూర్తిగా ఎన్నికలను తలపిస్తోంది. బీసీ గర్జన అంటూ బీసీలను సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో పార్టీలో ఇంచార్జ్‌లను మార్చేసి హడావుడి పెంచేశారు.
మరోవైపు, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రతి ఒక్కరినీ ఇంటింటి బాట పట్టించింది. ఇక, నియోజకవర్గాల సమీక్ష పేరుతో మరో వైపు ఎన్నికల సమరాన్ని తలపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు సీఎం జగన్. గతంలో ఓడిపోయిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రజలకు హామీలపై హామీలు గుప్పిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఏకేస్తున్నారు.
ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే.. ఏదో వ్యూహం ఉందనే ఆలోచనలో ప్రత్యర్థి పార్టీలు కూరుకుపోయాయి. అందుకే తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఇలా ఆయన ఆరుమాసాలుగా చెబుతున్నా.. ఇప్పటి వరకు అలాంటి ఊసులేదు. కానీ, అలా అనుకునేలా చేయడమే సీఎం జగన్ స్పెషల్‌గా ఉంది. అయితే, దీనివల్ల ఆయనకు వచ్చిన లాభమేంటి? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ప్రత్యర్థి పార్టీలను తికమకలో పెట్టి.. రాజకీయ వ్యూహానికి తెరదీసినట్టుగా తెలుస్తోంది.