జ‌గ‌న్ విశ్వాసాన్ని కోల్పోతున్న నాయ‌కులు… రీజ‌నేంటి…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఎవ‌రినైనా ఒక్క‌సారి న‌మ్మితే.. వారిపై చాలా భ‌రోసా పెట్టుకుంటార‌నే పేరుంది. వారికి కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌గిస్తారు. ఇలా.. అనేక మందిని ఆయ‌న న‌మ్మిన బంట్లుగా పెట్టుకున్నారు. ఇది 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి బాగా క‌లిసి వ‌చ్చేలా చేసింది. అయితే, చిత్రంగా ఇప్పుడు మాత్రం ఈ ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. కార‌ణాలు ఏవైనా.. కూడా నాయ‌కులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు.

దీంతో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఇంచార్జుల‌ను మార్చేస్తూ.. తాజాగా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డం.. వైసీపీలో ఆస‌క్తిగా మారింది. దీనిని కొంద‌రు స్వాగ‌తిస్తుంటే.. మ‌రికొంద‌రు నొచ్చుకుంటున్నారు. క‌ర్నూలు లో ఇటీవ‌ల‌.. చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపైనా.. ఎమ్మెల్యేలు, సీఎంపైనా తీవ్ర‌స్థా యిలో విరుచుకుప‌డ్డారు. ఇక‌, జ‌న‌స‌మీక‌ర‌ణ కూడా బాగానే చేశారు. ఈ నేప‌థ్యంలో ఇక్కడ వైసీపీ బాధ్య‌త‌లు చూస్తున్న వైసీపీ నాయ‌కులు స్పందించ‌లేదు.

ముఖ్యంగా ఆదోని, మంత్రాల‌యం ఎమ్మెల్యేలు.. సాయిప్ర‌సాద్ రెడ్డి, బాల‌నాగిరెడ్డిలు.. చంద్ర‌బాబుపై ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. దీంతో వైసీపీఅధిష్టానం డిఫెన్స్‌లో ప‌డింది. అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందోని ఆరా తీసింది. నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో వైసీపీ బాధ్య‌త‌ల‌ను సీఎం జ‌గ‌న్ అత్యంత న‌మ్మ‌క‌స్తులైన వారికి మాత్ర‌మే అప్ప‌గించారు. అలాంటి వారు కూడా ఇప్పుడు విఫ‌లమ‌వుతుండ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చేయ‌డం .. క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే మార్పు దిశ‌గా వైసీపీ అధినేత అడుగులు వేస్తున్నార‌నితాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నా యి. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని చెబుతున్నా.. చాలా మంది నాయ‌కులు ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం. లైట్ తీసుకోవ‌డం సీఎం జ‌గ‌న్‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌పై మార్పు కొర‌డా ఝ‌ళిపించ‌డ‌మే బెట‌ర్ అని భావించ‌డంతో నేత‌ల్లో ద‌డ ప్రారంభ‌మైంది.