ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. “నాకు-మానాన్నకు రాజకీయంగా సంబందం లేదు. ఆయన నోటికి తాళం వేయలేను” అని అన్నారు. అయితే, తన తండ్రిగా ఆయనను ఎప్పుడు గౌరవిస్తానన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, సీఎం జగన్ మాటే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, కొందరు కావాలనే సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఒక వర్గం పని కట్టుకొని వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే మూడు వారాలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు.
తన జీవితం అంతా వైసీపీతోనేనని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇతరులకు ఇస్తే సహకరిస్తానన్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తానన్నారు. సీఎం బీజీగా ఉండటంతో ఇప్పటి వరకు ఆయనను కలవలేదని పేర్కొన్నారు. చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.
మరోవైపు ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న చికాకులపై సజ్జలకు వివరించారు. మంత్రి జోగి రమేష్‌పై విమర్శల విషయాన్ని సజ్జలకు వివరించానన్నారు. అన్ని వర్గాలకు తన నియోజకవర్గంలో సమ ప్రాధాన్యం ఉందని… అయినా తనకు చికాకులు తప్పడం లేదనే విషయాన్ని సజ్జలకు చెప్పానన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.