సాయిరెడ్డి సెల్ పోయింది.. అనేక సందేహాలు?!

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయిన‌ట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్‌కు ఎంత భ‌ద్ర‌త ఉంటుందో వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి కూడా దాదాపు అంతే భ‌ద్ర‌త ఉంటుంది. ఆయ‌న‌కు ఆరుగురు వ‌ర‌కు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు ఉన్నారు. ఆయ‌న వెంట ఎప్పుడూ న‌లుగురు ఉంటారు. ఇక‌, ఆయ‌న అప్పాయింట్మెంట్ కావాల‌న్నా.. అంత ఈజీఏమీ కాదు. ఎంతో ప‌క్కా స‌మాచారం, అవ‌స‌రం ఉంటేనే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. మ‌రి అలాంటి నాయ‌కుడి అత్యంత విలువైన‌ సెల్ ఫోన్ పోయిందంటే ఇదేమీ తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, సెల్ ఫోన్ పోయింద‌ని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా జ‌రిగిందా? జ‌రుగుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో విజ‌య‌సాయిరెడ్డి కుటుంబ బంధువు శ‌ర‌త్ చంద్రారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ద‌రిమిలా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని వ‌రుస పెట్టి విచారిస్తోంది. అదేవిధంగా సాయిరెడ్డి బంధువు కాబ‌ట్టి.. ఈయ‌న‌ను కూడా విచారించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా సాయిరెడ్డి ఫోన్ మిస్ కావ‌డం.. దీనిపై హుటాహుటిన పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం వంటివి తెర‌వెనుక వ్యూహం ఉందా? అనే సందేహాల‌కు బ‌లాన్ని చేకూరుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.