చంద్రబాబుకు గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఐదుగురు దోచుకుంటున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పనిచేయని వారికి టికెట్లు ఇవ్వవద్దని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎటువంటి రాజీలు లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరి సహకారం తీసుకోవడంలో తప్పులేదని తెలిపారు.

సమయం లేదు మిత్రమా అనే బాలకృష్ణ డైలాగ్ స్ఫూర్తితో అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఫలానా నేత పనికిరాడని భావిస్తే టిక్కెట్ల కేటాయింపులో రాజీపడొద్దని చంద్రబాబుని కోరారు. తాను పనిచేయట్లేదని భావిస్తే… తనకు టిక్కెట్టివ్వొద్దన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్లాలన్నారు. ప్రజలు మన పక్షాన ఉన్నప్పుడు టెన్షన్ పడొద్దని అధినేతకు సూచించారు.

చంద్రబాబు కూల్‌గా ఉండి నిర్ణయాలు తీసుకుంటే చాలన్నారు. రావణాసుడిని నేరుగా చంపే సత్తా శ్రీరాముడికి ఉన్నా.. లోక కళ్యాణం కోసం ఉడత నుంచి రావణాసురుడి సోదరుడు సహా అందరి సహకారం తీసుకున్నాడన్నారు. మనమూ అదే ధోరణితో వెళ్లాలని తెలిపారు. 2019 ఎన్నికలు ఓ పీడకల అని.. ఇక దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని క్షేత్రస్థాయిలో ప్రజలు బలంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని, ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోలాగానే మూడు జిల్లాలకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించాలని చంద్రబాబుకు సూచించారు. పార్టీ నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని కోరారు.