టీడీపీలో కాక‌రేపుతోన్న బాబు నిర్ణ‌యం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగినపార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశంలో ఆయ‌న వెల్ల‌డించిన ఒక అంశం ఇటు పార్టీలోనూ.. అటు పార్టీ అభిమానుల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 40 ఏళ్ల చంద్ర‌బాబు పొలిటిక‌ల్‌ హిస్ట‌రీలో తీసుకోని ఒక సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని బాబు తీసుకోబోతున్నార‌ని అంటున్నారు. అదేంటంటే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు రెండు స్థానాల నుంచి పోటీ చేయ‌డం. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే స్థానం నుంచి బాబు పోటీ చేశారు. కానీ, ఇప్పుడు మారుతున్నారు.

ఔను.. ఈ విష‌యంపై చంద్ర‌బాబు నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు పార్టీలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చంద్ర‌బాబు గ‌తం లో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. నిజానికి గ‌త ప‌దేళ్లుగా చంద్ర‌బాబు నామినేష‌న్ రోజు మాత్ర‌మే కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి వ‌చ్చేస్తున్నారు. త‌ర్వాత వ్య‌వ‌హారం అంతా కూడా అక్క‌డి నాయ‌కులు చూసుకుంటున్నారు.

అయినా కూడా చంద్ర‌బాబు తిరుగులేని ఆధిప‌త్యంతో విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయిది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీనిని మునిసిపాలిటీ చేశారు. ఇక్క‌డ పాగా వేశారు. ఇటీవ‌ల ఇక్క‌డ 60 వేల కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు కూడా చేప‌ట్టారు. దీనికితోడు టీడీపీ కేడ‌ర్‌ను క‌కావిక‌లం చేశార‌నే రాజ‌కీయ వాద‌న కూడా ఉంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు నెల‌లో రెండు సార్లు కుప్పం ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నారు. కార‌ణం క‌ల్పించుకుని మ‌రీ ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ దూకుడు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితిలో కుప్పంలో చంద్ర‌బాబును ఓడించి తీరుతామంటూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు రెండో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. గుంటూరు -2 లేదా.. పెద‌కూరపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి చంద్ర‌బాబు పోటీ చేస్తార‌ని అత్యంత విశ్వ‌సనీయ నేత‌ల నుంచి మీడియాకు లీకులు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాజ‌ధాని సెంటిమెంటు ఉంటుంద‌ని, త‌న గెలుపు ఖాయ‌మ‌ని.. చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. గ‌తంలో ఎన్టీఆర్ కూడా పార్టీ మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే… డోన్‌, గుడివాడ‌ల నుంచి పోటీ చేశారు. సో.. ఇలా చంద్ర‌బాబు చేయ‌డం కూడా త‌ప్పులేద‌ని కొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు.