రాష్ట్ర రాజకీయాల్లో యువ నాయకుల జోరు బాగానే కనిపిస్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోను, అటు వైసీపీలోనూ యువ నాయకులు జోరుగా తెరమీదికి వస్తున్నారు. వారికి టికెట్లు వస్తాయా? రావా? అనే విషయాలను పక్కన పెడితే..వారు మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని(ప్రస్తుతం పల్నాడు) వినుకొండ నియోజకవర్గంలో యువ నాయకుడి జోరు హోరు హోరుగా సాగుతోంది. ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు .. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు.
ఇప్పుడు గడపగడపకు పాదయాత్ర చేస్తూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే ఆయన తన వారసుడు.. బొల్లా గిరి బాబును ప్రజలకు పరిచయం చేస్తున్నారు. తన వెంటే పాదయాత్రలో తిప్పుకొంటున్నారు. తనతోనే సభలకు, సమావేశాలకు కూడా తీసుకువెళ్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం వన భోజనాల పేరుతో యువతను సమీకరిస్తున్న గిరిబాబు.. తనకంటూ కేడర్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుండడం ఆసక్తిగా మారింది. మరోవైపు స్వామి మాల వేసుకున్నవారిని కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
వారు చేస్తున్న భజనలకు ఫండింగ్ ఇవ్వడం.. వారు ఎక్కడ ఎప్పుడు పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. ఇక, బ్రహ్మనాయుడు ఒకవైపు గడపగడపకు మన ప్రభుత్వం పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు గిరి కూడా.. దీనిని ఫాలో అవుతున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా తెల్లారిలేస్తే.. ఎక్కడో ఒక చోట కనిపిస్తుండడం, ఏవేవో కార్యక్రమాలలో పాల్గొంటుండడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చది లేదని.. సీఎం జగన్ స్పష్టం చేశారు.
వచ్చే సారి అన్ని చోట్లా ప్రస్తుతం ఉన్న వారికే ఛాన్స్ ఉంటుందని, ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ చెబుతున్నారు. అయినా.. కూడా బొల్లా మాత్రం తనకుమారుడిని రంగంలోకి దించారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో తన ప్లేస్‌ను తన వారసుడిగా గిరికి ఇవ్వాలని చూస్తున్నారా? లేక.. తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఏకకాలంలో తండ్రీ కొడుకులు ప్రయత్నాలు చేస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, టీడీపీ బలంగా ఉన్నదన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో దీనికి దీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కుమారుడిని కూడా లైన్‌లో పెట్టారా? అనేది ఆసక్తిగా మారింది.