మునుగోడు ఉప ఎన్నిక‌ ఖ‌ర్చు 600 కోట్లు!

ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక‌లో డ‌బ్బులు వ‌ర‌ద‌లై పారాయి. ఓటుకు ఇంత‌ని అన్ని ప్ర‌ధాన పార్టీలు పంప‌కాలు చేశాయి. ఒక‌రికిమించి మ‌రొక‌రు అన్న విధంగా పార్టీలు ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఓటుకు వేల రూపాయ‌లు పందేరం చేశారు.

అయితే.. ఈ పంప‌కాల లెక్క‌లపై తాజాగా వివ‌రాలు వెలుగు చూశాయి. దీని ప్ర‌కారం.. 2ల‌క్షల మంది ఓట‌ర్లు ఉన్న మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి.. 627 కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్టు తెలిసింది. ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అనే సంస్థ‌.. మునుగోడు ఉప ఎన్నిక‌లో పార్టీలు.. అభ్య‌ర్థులు చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఆరా తీసింది. ఈ అంచ‌నాల ప్ర‌కారం.. మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి దాదాపు 627 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయ‌ట‌!

స‌ర్వేలో కీల‌క విష‌యాలు

*తాజాగా వెలుగు చూసిన స‌ర్వేలో మునుగోడులో ప్ర‌తి ఓట‌రుకు ఓటుకు స‌గ‌టున 9 వేల రూపాయ‌లు ఇచ్చిన‌ట్టు అయింది.

*దాదాపు 75 శాతం ఓట‌ర్ల‌కు ఈ సొమ్ములు అందాయి.

*ఓటుకు నోటు పంపిణీ.. ఎన్నిక‌ల రోజు కూడా కొన‌సాగింది

*ఓటుకు.. 9 వేల రూపాయ‌ల చొప్పున ఓట‌రు అందుకున్నారు.

*టీఆర్ఎస్ త‌మ‌కు ఐదు వేల రూపాయ‌లు ఇచ్చింద‌ని, బీజేపీ 4 వేల రూపాయ‌లు ఇచ్చిందని ఓట‌ర్లు బాహాటంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

*75 శాతం ఓట‌ర్ల‌కు క‌నీసం ఒక్కొక్క‌రికీ 9 వేల రూపాయ‌లు అందింది.

*ఇక మ‌ద్యం ఏరులై పార‌డంతో దాదాపు 300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ మ‌ద్యం పంప‌కాలే జ‌రిగాయి.

*పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించాయి. వీటికి వంద కోట్ల రూపాయ‌ల పైనే ఖ‌ర్చు అయింది.

*ఒక్కో ర్యాలీకి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అనుకున్నా.. అన్ని పార్టీల‌వీ క‌లిపి 50 ర్యాలీల వ‌ర‌కూ జ‌రిగాయ‌ని, ఇలా చూస్తే 125 కోట్ల రూపాయ‌లు ఇలాంటి ప్ర‌చార ఆర్భాట ఖ‌ర్చులుంటాయ‌ని అంచ‌నా వేసింది. ఏతావాతా మునుగోడు ఖ‌ర్చు 627 కోట్ల రూపాయ‌ల‌ని ఈ సంస్థ లెక్క‌గ‌ట్టింది.