ఏపీలో రాజకీయం ఎంత జోరుగా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజే.. పొలిటికల్ సంచనాలునమోదు అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
మోడీ పర్యటన సందర్భంగా.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని జగన్ తన మాటలతోనూ.. చేతలతోనూ చేసి చూపిస్తే.. జగన్ సర్కారు చేసిన తప్పులపై విరుచుకుపడాలంటూ ప్రధాని మోడీ బీజేపీ నేతలకు చెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖకు ఆహ్వానించిన మోడీని.. పవన్ కలవటం.. ఆయనతో నలభై నిమిషాలకు పైగా భేటీ కావటం తెలిసిందే.
ఈ భేటీలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటే.. ఆ వాదనలో పస లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి గంటా.. టీడీపీలో కొనసాగుతూ కూడా.. ఇప్పటికి ఏ పార్టీలో ఉన్నారన్న దానిపై స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు.. పార్టీ మారతారో అన్నదానిపై తరచూ వార్తలు రావటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ నొవాటెల్ లో బస చేశారు. అక్కడకు గంటా రావటం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
పవన్ బస చేసిన ఐదో అంతస్తుకు ఆయన వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ భేటీ అయినట్లుగా చెబుతున్నారు. దీనిపై బోలెడన్ని విశ్లేషణలు వచ్చేశాయి. కానీ.. వాస్తవం ఏమంటే.. బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అదే హోటల్ లో లంచ్ కు గంటాను ఆహ్వానించటంతో ఆయన వెళ్లారని.. అక్కడే పవన్ ఉండటంతో.. పాత పరిచయంతో వెళ్లి కలిసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు గంటా సిద్ధమయ్యారని.. తాజా పరిణామం నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారా? జనసేనలో చేరతారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.