మోడీ-పవన్.. బాబు-రామోజీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. జనసేనాని విశాఖపట్నం పర్యటన తర్వాత చంద్రబాబు ఆయన్ని కలవడం రాజకీయంగా వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. పవన్‌ను జగన్ సర్కారు విశాఖలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వెళ్లడం.. ఇద్దరూ కలిసి విలేకరులతో కలివిడిగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది.

ఇది తెలుగుదేశం, జనసేన పొత్తుకు సంకేతమని అందరూ భావించారు. కొన్ని రోజులు గడిచేసరికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. విశాఖపట్నంలో శనివారం సభ జరగబోతుండగా.. ముందు రోజు మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమావేశం జరగడానికి ముందే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు.. ఈనాడు అధినేత రామోజీ రావును కలవడం చర్చనీయాంశం అయింది.

మోడీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్నాడు పవన్. ఈ సమావేశంలో ఏం చర్చ జరిగిందన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో బంధానికి బైబై చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆపడానికి మోడీ ప్రయత్నించి ఉంటాడనే చర్చ జరుగుతోంది. అలా కాకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని.. ఐతే పవన్ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రధానికి చెప్పిన జగన్‌ను ఓడించాల్సిన అవసరాన్ని గుర్తు చేసి ఉంటారని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇక్కడ మోడీ పర్యటన జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌కు వెళ్లి బాబు.. రామోజీని కలవడం మరో ఆసక్తికర చర్చకు దారి తీసింది. చంద్రబాబు రాజకీయంగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రామోజీని సంప్రదిస్తారని అంటుంటారు. పొత్తులతో పాటు జగన్‌ను ఎదుర్కొనే విషయంలో బాబు-రామోజీ మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.