నామినేష‌న్లు వేశారు.. మరి వాళ్ళ సంగతి?

తెలంగాణ‌లో రాజ్య‌స‌భ సీట్ల వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింది. రెండు స్థానాల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయ‌కుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ, సీఎం స‌ల‌హాదారు.. వేం న‌రేంద‌ర్‌రెడ్డి గురువారం రెండు సెట్ల నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ఈ ఎన్నిక‌లు ఈ నెల 16న జ‌ర‌గ‌నున్నాయి. ఎలానూ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బ‌లం ఉంది కాబ‌ట్టి.. వీరి గెలుపు కూడా లాంఛ‌న‌మే. ఇద్ద‌రూ పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌డం కూడా ఖాయ‌మే.

అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు ఈ సీట్ల కోసం ఆది నుంచి ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి?  ర‌గిలిపోతున్న నాయ‌కులను ఓదార్చేదెవ‌రు? అనేది ఇప్పుడు కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు వేరేగా ఉండేవని.. అసంతృప్తులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు కేవ‌లం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే వింటున్నార‌ని.. ఆయ‌న చెప్పిందే పాటిస్తున్నారని హ‌నుమంత‌రావు వంటి దిగ్గ‌జ నాయ‌కుడు బ‌హిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఇక‌, చిన్నారెడ్డి స‌హా.. ఈ సీట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్న మ‌రింత మంది కూడా సీఎం రేవంత్ వైఖ‌రిపై అంతర్గ‌త సంభాష‌ణ‌ల్లో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు ద‌క్క‌క‌పోవ‌డం ఒక ఎత్త‌యితే.. అస‌లు అధిష్టానం త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేద‌న్న‌ది వీరు చెబుతున్న ప్ర‌ధాన కార‌ణం. “టికెట్ ఇవ్వ‌క‌పోతే పోయారు.. అస‌లు మాతో మాట మాత్రం కూడా చెప్ప‌రా?“ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. హ‌నుమంత‌రావు అయితే.. ఏకంగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి.. ఇంటికి తాళం కూడా వేసుకున్న‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు.

టీక‌ప్పులో తుఫానా?

అయితే.. ఈ అంస‌తృప్తులు.. సంతృప్తులు.. పార్టీకి కొత్త‌కాద‌ని.. కొంద‌రు చెబుతున్నారు. ఇవ‌న్నీ టీక‌ప్పులో తుఫాను మాదిరిగా తేలిపోతాయ‌ని అనేవారు కూడా ఉన్నారు. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఇప్ప‌టికే జ‌గ్గారెడ్డి స‌హా.. జీవ‌న్ రెడ్డి సీనియ‌ర్ నాయ‌కులు ఇటు స‌ర్కారుపైనా.. అటు పార్టీపైనా రగిలిపోతున్నారు. మ‌రోవైపు కొండా దంప‌తుల ఆధిప‌త్య హోరు.. వ‌రంగ‌ల్‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అసంతృప్తి స్వ‌రం ఢిల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అన్ని వైపు ల‌నుంచి పెరుగుతున్న అసంతృప్తిని చ‌ల్లార్చ‌డం .. త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని కొంద‌రు చెబుతున్నారు.