అంతా సవ్యంగా ఉంది, మార్చి 19 నుంచి థియేటర్లలో నాన్ స్టాప్ ఇరవై నాలుగు గంటలు షోలు వేసుకుంటూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని ఎదురు చూస్తున్న బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల నరాలు చిట్లిపోతున్నాయి. టాక్సిక్ వాయిదా పడిన ఆనందం ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండా, దాన్ని ఆవిరి చేసేలా దురంధర్ 2 రివెంజ్ కూడా పోస్ట్ పోన్ అవ్వొచ్చనే వార్త వాళ్ళకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా తప్పుకుంటే డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో బాంబులు పడినట్టే.
ఎందుకంటే ఒక్క దురంధర్ 2 మీదే ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్లకు పైగా వ్యాపారం జరగాల్సి ఉంది. అదంతా పెండింగ్ లో పడితే ఎంత వడ్డీ నష్టమో ఊహకు అందదు. ఇప్పటికైతే నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. చేతిలో కేవలం 15 రోజులు ఉన్నప్పటికీ ట్రైలర్ అప్డేట్ రాలేదు. పోనీ పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ల లాంటివి ఏమైనా వదులుతున్నారా అంటే అదీ లేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ఆడియో సాంగ్స్ చాలా కీలకం. వాటి ఊసే లేదు.
తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ ఉంటుందని గత ఏడాదే చెప్పారు. కానీ ఆ సూచనలు ప్రస్తుతానికి లేవు. దురంధర్ 2 తప్పుకునే సూచనలు గమనించే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం అడ్వాన్స్ గా మార్చి 19 విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ రెడీ అవుతోంది. ఏ నిమిషమైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. వీలైనంత త్వరగా దురంధర్ టీమ్ నుంచి అఫీషియల్ నోట్ రావడం చాలా అవసరం. దాన్ని బట్టి ఇతర నిర్మాతలు ప్లాన్ చేసుకోవడానికి లేదు.
టాక్సిక్ న్యూస్ తెలియడం ఆలస్యం తమిళ, కన్నడ సినిమాలు ఆల్రెడీ ఆ స్లాట్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. మన దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది కాబట్టి మిగిలినవాళ్లు రిస్క్ చేయరు. లేదూ దురంధర్ 2 డేట్ లో ఎలాంటి మార్పు లేదంటే మాత్రం అర్జెంట్ గా ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. సంకేతాలు చూస్తుంటే తప్పుకోవడం ఫిక్స్ అయినట్టే ఉంది. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే ఆగస్ట్ కి వెళ్లడం మినహా దురంధర్ 2కి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates