గత ఏడాది తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈసారి వృషకర్మగా రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కార్తీక్ దండు రెండో ప్రయత్నమిది. ఏడాదికి పైగానే చైతు దీని మీద వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే భరిస్తూ వచ్చాడు. ఇవాళ టీజర్ రూపంలో వృషకర్మ ప్రపంచం ఎలా ఉంటుందో సాంపిల్ చూపించారు.
సృష్టి వినాశనం కోసమే ఒక దుష్టశక్తి అవతరిస్తాడు. అతని నోటి వెంట పుట్టే గబ్బిలాన్ని తాకినా మనిషి ప్రాణాలు పోతాయి. అంతటి ప్రమాదరకమైన కిరాతకాన్ని ఆపే శక్తి ఒక్క వృషకర్మ(నాగ చైతన్య)కు మాత్రమే ఉంటుంది. అదెలా జరిగిందనేది అసలు స్టోరీ. విజువల్స్ లో చాలా డెప్త్ ఉంది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కథను ఎక్కువ రివీల్ చేయకుండా కార్తీక్ జాగ్రత్తలు తీసుకున్న వైనం స్పష్టం. మెయిన్ పాయింట్ బయట పడకుండా చైతు లక్ష్యం సినిమాలో ఏముంటుందనే దాని మీదే క్లారిటీ ఇచ్చాడు.
రెగ్యులర్ జానర్ కాకుండా ఈసారి కొత్త ప్రయత్నం చేసిన చైతు ఈ పాత్రకోసం శారీరకంగా ఒంటిని కష్టపెట్టడమే కాకుండా ఫిట్ నెస్, లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రెగ్యులర్ గా చూసే లాగా కాకుండా కొంచెం సన్నబడిన చైతు ఈసారి అభిమానులకు చాలా సర్ప్రైజులు ఇచ్చేలా ఉన్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన వృషకర్మకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. ఇంటెన్స్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదు.
వేసవిలోనే ఉంటుంది కానీ డేట్ త్వరలో ఫైనల్ చేయాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన వృషకర్మలో జయరాం, సత్య, జరీనా వహాబ్, శ్రీవాత్సవ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేసిన నాగచైతన్యకు ఇది పెద్ద బ్రేక్ అయ్యేలా ఉంది. తమ్ముడు అఖిల్ నటించిన లెనిన్ కన్నా వృషకర్మ ముందు వస్తుందా లేక తర్వాత రిలీజవుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates