రాష్ట్రంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో జనాభా అంశంపై గురువారం జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి జరగాలన్నా, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, సామాజిక సమతుల్యం పెరగాలన్నా జనాభాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు జనాభా విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలిపారు. అందుకే ఒక పిల్లో పిల్లాడో ఉంటే చాలనుకునే దంపతులు 57 శాతం మంది ఉన్నారని చెప్పారు.
ఇక ఇద్దరు పిల్లలు ఉంటే చాలనుకునే వారు 33 శాతం మంది ఉన్నారని చంద్రబాబు తెలిపారు. కానీ అలా అయితే రాష్ట్రం రాబోయే కొన్నేళ్లలో జనాభా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, కుటుంబాలకు పిల్లల పెంపకం భారం కాకుండా కూడా కొన్ని పాలసీలు తీసుకువచ్చామని వివరించారు.
ఈ క్రమంలో ఇద్దరు పిల్లలకు మించి ఎంతమందిని కన్నా ఒక్కొక్క పిల్లకు రూ.25,000 చొప్పున ప్రసవించిన సమయంలోనే తల్లులకు అందిస్తామని తెలిపారు. ఎంతమందిని కన్నా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, పైగా ప్రోత్సహిస్తామని చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మహిళలకు ఆరు నెలల మెటర్నిటీ లీవును 12 నెలలకు పెంచుతున్నామని తెలిపారు. పురుషులకు కొత్తగా ఒక నెల సెలవు ఇస్తామని చెప్పారు. ఇద్దరికి మించి పిల్లలు పుడితే పురుష ఉద్యోగులకు రెండేసి నెలల చొప్పున సెలవు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఐవీఎఫ్ సెంటర్లు
పిల్లలు కలగని దంపతులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అన్ని విధాలా పిల్లలను పెంచేందుకు సహకారం అందిస్తామని వివరించారు. అదే సమయంలో పిల్లలను ఎలా పెంచాలో కూడా ప్రభుత్వం శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates