ఇంకో రెండు వారాల్లో, ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముందు అనుకున్న దాని కంటే వారం ముందుగా సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బీజీఎం బాధ్యతల నుంచి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవాల్సి వచ్చినట్లుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
దేవిశ్రీ టైంలైన్‌కు తగ్గట్లుగా తాము కంటెంట్ ఇవ్వలేకపోయామని.. తాను కంటెంట్ ఇచ్చే సమయానికి దేవి అందుబాటులో ఉండట్లేదని.. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో దేవి బదులు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడని నిన్న ఒక నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
దీన్ని బట్టి చూస్తే ‘ఉస్తాద్’కు దేవి అసలు బీజీఎం పనే మొదలుపెట్టలేదని ఎవ్వరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని కొన్ని రోజుల ముందు ‘ఉస్తాద్’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
ఆ ఈవెంట్లో పక్కన హరీష్ శంకర్ సహా పలువురు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఉండగా.. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ బీజీఎం వర్క్ గురించి మాట్లాడాడు. ఆల్రెడీ నేపథ్య సంగీతం పని మొదలైందని.. ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందని దేవి ఆ సందర్భంగా చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి హరీష్ శంకర్ అనుమతిస్తాడో లేదో అని అంటుండగా.. హరీష్ వచ్చి భుజం తట్టాడు.
తర్వాత దేవి కొనసాగిస్తూ.. ఈ సినిమాకు బీజీఎం చేయకముందు సన్నివేశాలు చూసే తమ స్టూడియోలో అందరూ హర్షాతిరేకాలు చేశారని.. బీజీఎం కూడా తోడైతే ఔట్ పుట్ ఊహించుకోండి అన్నట్లు మాట్లాడాడు. సినిమాను హరీష్ వేరే లెవెల్లో తీశాడని.. మిగతా అంతా ఒకెత్తయితే క్లైమాక్స్ మరో ఎత్తు అని కూడా దేవి ఆ సందర్భంగా చెప్పాడు.
మిగతా విషయాలు పక్కన పెడితే.. దేవి మాటల్ని బట్టి చూస్తే అతను బీజీఎం దాదాపుగా ఫినిష్ చేసినట్లే చెప్పాడు. అలాంటపుడు టైం లైన్‌కు సెట్ కాలేదని దేవి స్థానంలో తమన్‌ను తీసుకురావడం అన్నది ఎంత వరకు నిజం అన్నది ప్రశ్నార్థకం. బహుశా దేవి వర్క్ పట్ల సంతృప్తి చెందకపోవడం, అతను ఆలస్యం చేస్తుండడం వల్ల తమన్‌ను ఎంచుకున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. తమన్‌తో బీజీఎం చేయించడం పట్ల దేవి మౌనం పాటిస్తుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates