లోకేశ్ పాదయాత్ర.. ఆ రెండే లక్ష్యమా?

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మాజీ మంత్రి నారా లోకేశ్ పై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేకపోయిన వైనం.. ఆయన సామర్థ్యంపై కొత్త సందేహాలకు తెర తీసింది. ప్రత్యక్ష రాజకీయాలతో చట్టసభలకు ఎంట్రీ ఇవ్వని లోకేశ్.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవితో మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. చినబాబుకు సామర్థ్యం లేదని.. ఆయన రాజకీయాల్లో తన ముద్రను చూపించలేరంటూ ప్రచారం జరగటం తెలిసిందే.

లోకేశ్ అన్నంతనే పప్పు.. పప్పు నాయుడు.. ఇలాంటి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తరచూ విరుచుకుపడటం తెలిసిందే. ఆయన మాటను.. ఆకారాన్ని వేలెత్తి చూపుతూ విమర్శలు చేసే వారికి.. కొవిడ్ వేళ.. సరికొత్త మేకోవర్ కోసం చాలానే కష్టపడిన లోకేశ్.. చివరకు అనుకున్నది సాధించారు. స్లిమ్ అయిన లోకేశ్.. తన డిక్షన్ లోని తప్పుల్ని సరిదిద్దుకున్నారు. గతంలో మాదిరి తరచూ తప్పులు మాట్లాడుతూ దొరికిపోకుండా ఉంటే.. కాస్తంత ఫైర్ ను పెంచారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ పాదయాత్ర చేస్తారని ఒకసారి.. కాదు సైకిల్ యాత్ర చేస్తారని మరోసారి.. అదేమీ కాదు బస్సుయాత్ర పక్కా అంటూ పలు వాదనలు..విశ్లేషణలు వినిపించాయి.

వీటికి భిన్నంగా లోకేశ్ ఎట్టకేలకు తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు. దీంతో.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. జనవరి 27న తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించే లోకేశ్.. రాయలసీమ నుంచి కోస్తాలోకి ఎంటర్ అయి.. ఉత్తరాంధ్రలో తన యాత్రను ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత జనవరి24 అనుకున్నా.. ఆ తర్వాత రిపబ్లిక్ డే 26 తర్వాతి రోజైన జనవరి 27 నుంచి పాదయాత్ర షురూ చేయాలని ఆయన నిర్ణయించారు.

2023 జనవరిలో మొదలయ్యే లోకేశ్ పాదయాత్ర.. 2024 ఫిబ్రవరి వరకు సాగుతుందని చెబుతున్నారు. అవసరమైతే మార్చి వరకు కంటిన్యూ చేసేందుకుసైతం తాను సిద్ధమన్న విషయాన్ని లోకేశ్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అంటే.. దగ్గర దగ్గర 400రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రతో తనను తానుఫ్రూవ్ చేసుకోవటంతోపాటు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇష్యూల మీద తనకున్న అవగాహనను ప్రజలకు తెలియజేయటంతో పాటు.. తన సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేసే వారికి.. తన పాదయాత్రతో సమాధానం చెప్పాలన్నది లోకేశ్ లక్ష్యమంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి రేసులో తన తండ్రి చంద్రబాబు ఉండటం తెలిసిందే. చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చెబుతున్నా.. ఆయనకు అంత సీన్ లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. తనను తాను నిరూపించుకోవటంతో పాటు.. తన శక్తి సామర్థ్యాలు.. తనకున్న సత్తా చాటాలన్నదే లోకేశ్ లక్ష్యమంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే లోకశ్ పాదయాత్ర.. ఆయన ఫ్యూచర్ కోసం ఆయన చేసుకుంటున్నదిగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఆయన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఏ తరహా పరిణామాలకు తెర తీస్తుందో చూడాలి.