తమ్ముడు తనవాడైతే.. అన్నట్టుగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారం అంటున్నారు ప్రజాస్వా మ్య వాదులు. ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం స్వయంప్రతిపత్తి(అటానమస్) ఉన్న ఎన్నికల సంఘానిదే. అయినంత మాత్రాన.. ప్రజలకు అసలు సమాచారం అందించకూడదు.. ఏమీ చెప్పకూడదు అనే విశేష అధికారాలను వినియోగించడం.. టీఎన్ శేషన్ వంటి నిఖార్సయిన అధికారి ఉన్నప్పుడు కూడా చేయలేదు.
కానీ, ఇప్పుడు మాత్రం తనకు ఉన్న విశేషాధికారాల పేరిట కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కావడం గమనార్హం. దీంతో ఇదే నిర్ణయం.. ఇదేం ఆదేశం.. చోద్యం కాకపోతే.. అని ప్రజాస్వామ్య వాదులు బుగ్గలు నొక్కకుంటున్నారు. మరి ఈసీ ఏం చేసిందంటే..
ఈసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్ అంచనాల ప్రసారం, ప్రచురణను నిరోధించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. హిమాచల్‌లో నవంబర్ 12వ తేదీన, ప్రధాని నరేంద్ర మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు.. అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో తెరవెనుక ఏమైనా జరిగిందా? అనే సందేహాలను ప్రజాస్వామ్య వాదులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.