రుషికొండ‌పై సీఎం జ‌గ‌న్‌కు రిలీఫ్‌

విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌ను త‌వ్వేస్తున్నార‌ని.. అక్క‌డ జ‌రుగుతున్న త‌వ్వ‌కాల‌ను అడ్డుకోవాలని.. కోరుతూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ధ‌ర్మాస‌నం.. విచార‌ణ‌కు స్వీక‌రించేదిలేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో సీఎం జ‌గ‌న్‌కు ఒకింత రిలీఫ్ ద‌క్క‌గా.. ఎంపీ రాజు గారికి మాత్రం భారీ షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. అయితే, విచార‌ణ విష‌యంలో హైకోర్టుకు పూర్తి అధికారాలు ఉన్నాయ‌ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

రుషికొండపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్ ఎంపీ రఘురామకు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున అక్కడ విచారణ పూర్తయిన తరువాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది.

పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందంటూ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదని సుప్రీం కోర్టులో విన్న‌వించారు. రుషికొండపై నిర్మాణాలకు వెంటనే స్టే విధించాలని కోరారు. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. దీనిపై హైకోర్టునే ఆశ్ర‌యించాల‌ని తేల్చి చెప్పింది.

అయితే, ఇప్ప‌టికే ఈ విష‌యంపై హైకోర్టు సీరియ‌స్‌గా ఉంది. రుషి కొండ నిర్మాణాల విష‌యంలో ప్ర‌భుత్వం ఏదో దాస్తోంద‌ని.. ఇటీవ‌ల జ‌రిపిన విచార‌ణ‌లో తేల్చి చెప్పింది. అంతేకాదు.. అక్క‌డ ఏం జ‌రుగుతోందో తేల్చేందుకు ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్క‌డ అక్ర‌మాలు జ‌రుగుతుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రించింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.