రాజకీయాల్లో పార్టీలకు కానీ, నాయకులకు కానీ అసలు అవకాశం రావడమే కష్టం. అవకాశం వచ్చిందా.. వెంటనే దానిని అందిపుచ్చుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నించిన సందర్భాలు అనేకం. మరీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తు న్నారు. పొత్తులు పెట్టుకుంటారా? లేదా? అనేది పక్కన పెడితే.. వ్యక్తిగతంగా పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని డెవలప్ చేస్తున్నారు కూడా. అయితే, ఇలాంటి కీలక సమయంలో జనసేనకు ఒక చక్కని ఛాన్స్ వచ్చింది. అదే.. ఈడబ్ల్యుఎస్(అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు) రిజర్వేషన్ల అంశం తెరమీది కి వచ్చింది.
ఇది 10 శాతం కోటా. పైగా.. బీజేపీ ప్రభుత్వమే దీనిని ప్రకటించింది. సో.. దీని అమలుకు ఉన్న అడ్డంకు లు సైతం తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ అంశాన్ని జనసేన అందిపుచ్చుకుని ఉంటే బాగుంటుందనేది మేధావుల అభిప్రాయం. గతంలో 2019లో వచ్చిన ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని చంద్రబాబు వినియోగించుకున్నారు. ఎన్నికలకు ముందు వచ్చిన దీనిలో 5 శాతం ఏకంగా కాపులకు ఇచ్చేశారు. అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీని ఊసు ఎత్తడం లేదు.
పైగా కాపులకు ఇచ్చిన రిజర్వేషన్‌ను కూడా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ దీనిని అంది పుచ్చుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా.. ముఖ్యంగా కాపుల కోసం.. దీనిపై ఫైట్ చేయడం ద్వారా మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఆయన మాత్రం దీనిపై పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఈ రిజర్వేషన్ల మాటేంటని.. ఒక్క మాట కూడా జనసేన నేతలు కూడా ప్రకటించకపోవడం గమనార్హం.