ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఇటీవల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి మీడియాలో నిలిచారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఇటీవల కాలంలో ప్రజలు మరింత ఏవగించుకుంటున్నారని ఒకవైపు టీడీపీ సహా జనసేన నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఇదే విషయాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ఈ వ్యాఖ్యలు చేయడం.. సంచలనంగా మారింది. అయితే.. దీనిపై మీడియా ఇంకెలా ప్రచారం చేస్తుందని అనుకున్నారో ఏమో.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని ధర్మాన చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వలనే.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న మాటలో వాస్తవం లేదన్న ధర్మాన.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగిందన్నారు. విశాఖపట్నమే ఏకైక రాజధాని అని.. కర్నూలు, అమరావతిలో ఆ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతాయన్నా రు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రస్తుతం పరిపాలనలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నమేనన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన గోతులే ఇప్పుడు పెద్దవై ఉంటాయన్నారు.
సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారు అని ధర్మాన పేర్కొన్నారు. మరి ప్రజలు ఈయనను ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates