ఈ సోషల్ మీడియా కాలంలో ఫిలిం సెలబ్రెటీలైనా, పొలిటికల్ లీడర్లయినా.. ఏవైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేటపుడు కొంచెం ముందు వెనుక ఆలోచించుకోవడం మంచిది. తొందరపడి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత అటు ఇటు అయితే మీడియా వాళ్లు, సోషల్ మీడియా జనాలు వారిని మామూలుగా టార్గెట్ చేయరు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు ముందు చేసిన తొందరపాటు కామెంట్ వల్ల తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 11 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. దీనికి యాంకర్ స్పందిస్తూ.. ఆలోచించే ఈ మాట అంటున్నారా, తర్వాత మేం ఇదే స్టేట్మెంట్‌ను తిప్పి తిప్పి వేస్తాం, చూస్కోండి మరి అన్నా కూడా రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ సవాలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు కొంచెం పెద్ద తేడాతోనే ఓటమి చవిచూశారు.
దీంతో టీఆర్ఎస్ మద్దతుదారులే కాక, బీజేపీ అంటే పడని వాళ్లు, అలాగే కోటమిరెడ్డి సోదరుల వ్యతిరేకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు. రాజగోపాల్ రెడ్డీ.. ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావ్? తర్వాత ఏం చేయబోతున్నావ్? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరి దీనికి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.