గుంటూరు వైసీపీలో మ‌రో ముస‌లం.. సుచ‌రిత ఆగ్ర‌హం!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి త‌ల‌నొప్పులు వ‌ద‌ల‌డం లేదు. క‌నీసం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో సెగ‌లు పొగ‌లు క‌క్కిన అసంతృప్తి.. త‌ర్వాత‌.. పొన్నూరుకు పాకింది. ఇక‌, అక్క‌డ నుంచి రేప‌ల్లె, స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర పాడు, వినుకొండ, చిల‌క‌లూరిపేట ఇలా ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర అసంతృప్తి జ్వాల‌లు ర‌గులుతున్నాయి.

ఎక్క‌డికక్క‌డ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి ఎక్కువ‌గా కనిపిస్తోంది. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేయడం.. పార్టీ కార్య‌క్ర‌మాలు చేయ‌డం, ప్ర‌భుత్వం ఒక‌టి చెబితే వారు మ‌రో రూపం ఎంచుకోవ‌డం వంటివి ఆస‌క్తి గా మారి.. నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ భేదాల‌కు దారితీశాయి. తాడికొండ‌లో ఇంచార్జ్‌గా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావును నియ‌మించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఇంకా ఇది కొన‌సాగుతూనే ఉంది. ఇంతలో పొన్నూరులో ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత‌లే తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం రాజ‌కీయంగా వేడెక్కించింది.

మ‌రోవైపు.. చిల‌క‌లూరిపేట‌కు కొత్త‌గా ఇంచార్జ్‌ను నియ‌మించ‌డంతో మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టికి వ‌చ్చే సారి టికెట్ ఇవ్వ‌బోర‌ని సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌ల్లెలో టికెట్ అంబ‌టి కి ఇస్తార‌నే ప్ర‌చారంతో రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. వీటిని ప‌రిష్క‌రించాలంటూ.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రితకు అధిష్టానం ఆదేశాలు పంపించింది.

అయితే, దీనిని తాను స్వీక‌రించేది లేద‌ని, ఎవ‌రి బాధ వారు ప‌డ‌తార‌ని ఆమె ఆఫ్ ది రికార్డుగా తేల్చి చెప్పారు. అంతేకాదు.. అస‌లు తాను జిల్లా పార్టీ ఇంచార్జ్ బాధ్య‌త‌ల నుంచి కూడా త‌ప్పుకొంటున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించారు. దీనిపై ఇప్ప‌టికే అధిష్టానానికి లేఖ రాశాన‌ని, దీనిని ఆమోదిస్తార‌ని భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. ఎవ‌రు ఆమోదించినా.. లేక‌పోయినా తాను మాత్రం కొన్ని కార‌ణాల‌తో ఉద్దేశ పూర్వ‌కంగానే బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి జిల్లా వైసీపీలో రాజకీయాలు ఇంకా సెగ‌లు క‌క్కుతున్నాయ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.